భారత క్రికెట్ చూస్తే బాధేస్తోంది

20 Apr, 2016 14:03 IST|Sakshi
భారత క్రికెట్ చూస్తే బాధేస్తోంది

ఆయన ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి క్రికెటర్లలో ఒకరు. అలాంటి పెద్దమనిషికి ప్రస్తుతం భారత క్రికెట్ తీరును చూస్తే చాలా బాధ, నిరాశగా ఉందట. ఆయనే ఇయాన్ బోథమ్. ఇంగ్లండ్ జట్టుకు ఒకప్పుడు తిరుగులేని కెప్టెన్. 1992లో పాకిస్థాన్ పర్యటనతో రిటైర్మెంట్ ప్రకటించిన బోథమ్.. ఇప్పుడు భారత జట్టు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్న తీరును తప్పుబట్టారు. క్రికెట్ అంటే కేవలం 20 ఓవర్ల గేమ్ మాత్రమే కాదని, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. ఒకప్పుడు భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయంటే తనకు ఎంతో ఉద్వేగంగా అనిపించేదని, కానీ ఇప్పుడు మాత్రం అలా లేదని చెప్పారు. గడిచిన రెండు టెస్ట్ సిరీస్‌లలో ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు 0-4, 1-3 తేడాతో ఓడిపోయింది. 2012లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కూడా టీమిండియా ఓటమి చవిచూసింది.

భారత్‌లో టెస్ట్ క్రికెట్‌ ఏమైపోతోందని, అసలు ఈ జట్టుకు ఏమైందని బోథమ్ ప్రశ్నించారు. ఈ విషయంలో భారత్ ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగులలో భారత్‌ మూడో ర్యాంకులో ఉన్నా, ప్రస్తుత పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు ఈ ర్యాంకులు ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లేదని.. నిజానికి ఇప్పుడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మంచి క్రికెట్ ఆడుతున్నా అవి ఎందుకు ముందు లేవని అన్నారు. ఈ సంవత్సరం నవంబర్ - డిసెంబర్ నెలల్లో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనలో ఐదు టెస్టులు ఆడతారు.

>
మరిన్ని వార్తలు