ఆ మజానే వేరబ్బా: సౌరవ్‌ గంగూలీ

26 Nov, 2019 10:17 IST|Sakshi

కోల్‌కతా: భారత్‌ క్రికెట్‌ జట్టు తొలిసారి ఆడిన పింక్‌ బాల్‌ టెస్టుకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఖుషీ ఖుషీ అవుతున్నాడు.  ఇది తనకు టెస్టు మ్యాచ్‌లా అనిపించలేదని, ఒక వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లా అనిపించిదన్నాడు. ఇది తనకు మధరానుభూతిని తీసుకొచ్చిందని గంగూలీ పేర్కొన్నాడు.  మ్యాచ్ అనంతరం సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘చుట్టూ పరిశీలించండి (అభిమానులు వారి కెమెరా లైట్లతో చిత్రాలను క్లిక్ చేయడాన్ని చూపిస్తూ). మీరు దీనిని చూస్తున్నారా? మీరు దీనిని టెస్ట్ క్రికెట్‌లో చూశారా? టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇలా ఎప్పుడైనా స్టేడియం కిక్కిరిసిపోవడం చూశారా? ఇది ప్రపంచ కప్ ఫైనల్ అనిపిస్తుంది’ అని గంగూలీ అన్నాడు.

అదే సమయంలో 2001లో ఇదే స్టేడియంలో ఆసీస్‌తో తలపడిన టెస్టు మ్యాచ్‌ కూడా గుర్తుకొచ్చిందన్నాడు. ‘ఇది ఖచ్చితంగా అద్భుతమైన అనుభూతి. చాలా బాగుంది. మీ కోసం చూడండి. ఈ మ్యాచ్ నాటి జ్ఞాపకాలను ఈ మ్యాచ్ తిరిగి గుర్తు చేసింది. టెస్టు క్రికెట్ అంటే ఇలానే ఉండాలి’అని గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా పింక్‌ బాల్‌ డే అండ్‌ నైట్‌ విజయం కావడంతో తనను సహచరులు కూడా అభినందనల్లో ముంచెత్తుతున్నారని, ఇదొక సంతృప్తికరమైన అనుభూతి అని గంగూలీ పేర్కొన్నాడు.  గతంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడాలని బీసీసీఐని అడిగినప్పటికీ అందుకు అంగీకరించలేదు. అయితే, గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే డే నైట్ టెస్టు గురించి కోహ్లిని ఒప్పించడంతో పాటు డే నైట్ టెస్టు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించాడు.


 

మరిన్ని వార్తలు