తొలిరోజు జిమ్.. స్టేట్ చాంపియన్ మృతి

29 Jun, 2017 19:33 IST|Sakshi
తొలిరోజు జిమ్.. స్టేట్ చాంపియన్ మృతి

ముంబై: రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించిన మహిళా అథ్లెట్ జెనిడా కర్వాల్హో(29) గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాధ ఘటన ఎవర్‌షైన్ నగర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. నలాస్‌పరా (తూర్పు)కు చెందిన జెనిడా స్థానిక మధుబన్ హైట్స్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో నిన్న ఉదయం స్థానికంగా ఓ జిమ్‌లో తొలిరోజు వార్మప్ చేయడానికి వెళ్లింది.

గుండెకు సంబంధించిన ఎక్సర్‌సైజు చేసిన జెనిడా, అందుకు సంబంధించిన జిమ్ సాధనంతో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అంతలోనే ఆ అథ్లెట్ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన జిమ్ సిబ్బంది వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే జెనిడా కర్వాల్హో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు వల్లే ఆమె మృతిచెందిందని డాక్టర్లు వెల్లడించారు. బీపీ, షుగర్ లాంటి సమస్యలతో సతమతవుతున్నవారు వైద్యుల సూచన మేరకే జిమ్ చేయడం మంచిదని సూచించారు.

రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం
'కుటుంబంలో ఆదాయం ఉన్న ఏకైక వ్యక్తి జెనిడా. ఆమె కొన్నేళ్లుగా మధుమేహంతో బాధపడుతోందని' జెనిడా స్నేహితురాలు మధుమిత పూజారి చెప్పింది. స్కూళ్లో చదివేరోజుల్లో.. రాష్ట్రస్థాయిలో పలు కాంపిటీషన్లలో షార్ట్ పుట్ విభాగంలో పాల్గొని జెనిడా పతకాలు సాధించింది. డిగ్రీ చదివే సమయంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. డిస్కస్ అండ్ జావెలిన్ త్రో విభాగాల్లో జిల్లా, రాష్ట్రస్థాయిల్లో పతకాలు నెగ్గిన ఘనత ఆమె సొంతం. వచ్చే నెలలో కూపర్ హాస్పిటల్‌లో ఆమె చికిత్స తీసుకోవాల్సి ఉండగా.. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

మరిన్ని వార్తలు