ఉమర్ ను బౌల్డ్ చేసిన మహిళా క్రికెటర్!

18 Jul, 2017 12:24 IST|Sakshi
ఉమర్ ను బౌల్డ్ చేసిన మహిళా క్రికెటర్!

ఓస్లో: క్రికెట్ అనేది కేవలం పురుష ఆధిపత్యం ఉన్న ఆట మాత్రం కాదనేది ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఇందుకు ఇంగ్లండ్ లో ప్రస్తుతం జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ ఒక చక్కటి ఉదాహరణ. ఆ టోర్నీలో మహిళలు రికార్డులు సృష్టిస్తూ పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు. ఇదిలాఉంచితే, పురుష క్రికెటర్లు-మహిళా క్రికెటర్లు కలిసి మ్యాచ్లు ఆడటం అనేది చాలా అరుదు.

 

అయితే నార్వేలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్లో రెండు మహిళా క్రికెట్ జట్లు తలపడ్డాయి.  ఆ మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సైతం పాల్గొని అదనపు ఆకర్షణగా నిలిచాడు. కాగా, ఉమర్ ను ఓ చక్కటి బంతికి బౌల్డ్ చేసిందో మహిళా క్రికెటర్.  ఆ మహిళా క్రికెటర్ వేసిన అద్భుత బంతికి ఉమర్ అక్మల్ తడబడ్డాడు. బంతిని లెగ్ స్టంప్ పక్కనుంచి ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. ఆ అవుట్ ను ఊహించని అక్మల్ నవ్వుకుంటూ పెవిలియన్ కు చేరుకోగా, మహిళా క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు.