ఇదంతా అమెరికా కుట్ర..

31 May, 2015 09:49 IST|Sakshi
ఇదంతా అమెరికా కుట్ర..

ప్రత్యర్థుల ఎత్తుల్ని తుత్తునీయాలుచేసి ఏడోసారి ఫిఫా అధ్యక్షుడిగా గెలుపొందిన సెప్ బ్లాటర్.. అమెరికా తీరుపై నిప్పులు చెరిగారు. ప్రపంచకప్ నిర్వహణల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన అవినీతి నిరోధక శాఖ ఫిపా ప్రముఖుల్ని అరెస్టుచేయడాన్ని పెద్దన్న కుట్రగా ఆయన అభివర్ణించారు. ఫిఫా అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత అమెరికా కుయుక్తులపై మొదటిసారి ఆయన నోరువిప్పారు.

అమెరికా ఫిఫాను టార్గెట్ చేయడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, యురోపియన్ ఫుట్బాల్ యూనియన్ల నాయకుల ద్వారా యూఎస్.. ఫిఫాను పిప్పి చేసేందుకు యత్నిస్తోందని బ్లాటర్ ఆరోపించారు.  చైనాకు చెందిన జింగ్హువా న్యూస్ ఏజెన్సీ ఆదివారం ప్రసారం చేసిన వార్తాకథనంలో ఈ విషయాలను పేర్కొన్నారు.

యూఎస్ ఆదేశానుసారం గతవారం ఫిఫాకు చెందిన ఏడుగురు సీనియర్ అధికారులను, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను జ్యూరిచ్ లోని హోటల్ గదుల్లో స్విస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫిఫా 65వ కాంగ్రెస్ సమావేశానికి రెండు రోజుల ముందే ఈ అరెస్టులు చోటుచేసుకోవడం వెనుక కుట్ర కోణం దాగుందనే వాదనలు వినిపించాయి. బ్లాటర్ తాజా వ్యాఖ్యలు వాటిని నిజం చేశాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అరెస్టులు జరిగినరోజే ఆ వ్యవహారాన్ని అమెరికా ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. 2018, 2022లో ఫుట్బాల్ ప్రపంచకప్ వేడుకలు నిర్వహించాలనుకుని బిడ్డింగ్లో మట్టికరిచిన ఇంగ్లాండ్, అమెరికాలు ఫిఫాపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని క్రీడారంగ నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు