ఒత్తిడిలో ఎలా ఆడతారో!

27 Jun, 2018 01:44 IST|Sakshi

డిగో మారడోనా 

ఈ ప్రపంచకప్‌లో దక్షిణ అమెరికా దిగ్గజ జట్లకు ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. యూరప్‌ జట్లపై ఆరంభంలోనే ఆధిక్యం పొంది ఆ తర్వాత ‘డ్రా’తో సరిపెట్టుకున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత అర్జెంటీనా కంటే బ్రెజిల్‌ పరిస్థితి బాగుంది. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, కోస్టారికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో బ్రెజిల్‌ గెలిచిన తీరు వారిలో విజయకాంక్ష బలంగా ఉందని చాటి చెప్పింది. అయితే బ్రెజిల్‌కు చివరి మ్యాచ్‌ అంత తేలికేం కాదు. స్విట్జర్లాండ్‌ చేతిలో సెర్బియా దురదృష్టవశాత్తు ఓడిపోయింది. జర్మనీ రిఫరీ పెనాల్టీని ఇచ్చి ఉంటే సెర్బియా ఈ మ్యాచ్‌లో కనీసం ‘డ్రా’తో గట్టెక్కేది.

నాకౌట్‌ దశకు చేరుకోవాలంటే సెర్బియాకు మూడు పాయింట్లు అవసరం కాబట్టి బ్రెజిల్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. బ్రెజిల్‌ ఫార్వర్డ్స్‌ నెమార్, కౌటిన్హో, జీసస్‌ సమన్వయంతో కదు లుతూ ముందుకు దూసుకెళితే సెర్బియా కు కష్టాలు తప్పవు. ఈ మ్యాచ్‌ బ్రెజిల్‌ రక్షణ శ్రేణికి పరీక్షలాంటిది. స్విట్జర్లాండ్, కోస్టారికా జట్ల నుంచి బ్రెజిల్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోయినా సెర్బియాను తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా ఫార్వర్డ్‌ మిత్రోవిచ్‌ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. అతనిపై బ్రెజిల్‌ డిఫెండర్లు ప్రత్యేక్ష దృష్టి సారించాలి. బ్రెజిల్‌ సామర్థ్యంపై నాకు నమ్మకమున్నా ఒత్తిడిలో వారు ఎలా ఆడతారన్నది వేచి చూడాలి.   

మరిన్ని వార్తలు