మహా సమరం...మరో ప్రపంచం

14 Jun, 2018 01:02 IST|Sakshi

నేటి నుంచే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌

తొలి మ్యాచ్‌లో  సౌదీ అరేబియతో రష్యా ‘ఢీ’

రాత్రి గం. 8.30 నుంచి  సోనీ టెన్‌–2,3 లలో ప్రసారం

జగజ్జేత జర్మనీ...రికార్డుల బ్రెజిల్‌...అరివీర అర్జెంటీనా...చురుకైన స్పెయిన్‌...పట్టువిడవని ఫ్రాన్స్‌...కొరుకుడుపడని ఇంగ్లండ్‌......ఫేవరెట్లుగా ఓవైపు!పోరాడే పోర్చుగల్‌...సంచలనాల బెల్జియం...మెరికలాంటి మెక్సికో...ఉరకలెత్తించే ఉరుగ్వే...దడపుట్టించే స్వీడన్‌......దీటుగా మరోవైపు!ఆతిథ్య రష్యా...సమరానికి సై అనే సెనెగల్‌...కాలుదువ్వే కొలంబియా...పైకెదుగుతున్న పోలండ్‌...తేలిగ్గా తలొంచని కొరియా...
అదృష్టం కలిసొస్తే ఆస్ట్రేలియా...‘తూరుపు’ముక్క జపాన్‌......మేమున్నామంటూ ఇటువైపు!ఏ క్షణంలో ఎక్కడ గ‘గ్గోల్‌’ పుడుతుందో...ఏ మెరుపు మనల్ని మైమరిపిస్తుందో...ఏ మాయ మైకంలా కమ్మేస్తుందో...ఏ ఆటగాడు మీ ఇంటివాడైపోతాడో...ఏ కాళ్లు మీ కాళ్లకు బంధమేస్తాయో......కళ్లప్పగించేసి కదలకుండా ఉండండి...టీవీల ముందు ఠీవీగా కూర్చుండిపోండిఎందుకంటే ?31 రోజులు... 64 మ్యాచ్‌లుభూగోళమంతా ఆ బంతి వైపే...మైదానంలో మహామహులుచిరుత వేగం... డేగ చూపుపులి పంజా... సింహనాదంపాస్‌ల పొత్తులు... ఎత్తుకు పైఎత్తులు...వ్యూహాల చురకత్తులు... అన్నీ ఒక్కచోటే!...నేటి నుంచే విశ్వ క్రీడా సంరంభం ...సాకర్‌ ప్రపంచ సమరానికి ఆరంభం  

మాస్కో: మరోసారి యూరప్‌ దేశాల ప్రతాపమా? లేక దక్షిణ అమెరికా ఆధిపత్యమా? చీకటి ఖండ ఆఫ్రికా జట్ల పయనం ఎందాక? ఆసియా పసికూనలు ఈసారైనా మెరుస్తాయా? కాలమే సమాధానం ఇచ్చే ఈ ప్రశ్నలకు నేటి నుంచే కౌంట్‌ డౌన్‌. 12 మైదానాలు... 11 నగరాల్లో ఫుట్‌బాల్‌ మహా సంగ్రామం. ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా మధ్య తొలి పోరు. రోజులు గడిచే కొద్దీ రంజుగా సాగే మ్యాచ్‌లతో అభిమానులకు పసందైన విందు ఖాయం. 

ఆ ఆరేడు చుట్టూనే అంతా... 
దాదాపు 88 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో, 20 ప్రపంచ కప్‌లలో పదుల సంఖ్యలో జట్లు తలపడినా ఇప్పటివరకు విజేతలుగా నిలిచింది మాత్రం బ్రెజిల్‌ (5 సార్లు), జర్మనీ, ఇటలీ (4సార్లు), అర్జెంటీనా, ఉరుగ్వే (2సార్లు), స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ (ఒక్కోసారి) మాత్రమే. ఇందులో ఇటలీ క్వాలిఫై కాలేదు. ఈసారి కూడా మాజీ చాంపియన్స్‌ జట్ల నుంచే విజేత రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, బెల్జియం, పోర్చుగల్‌లను తీసిపారేయలేమని, మెక్సికో సంచలనాలు సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ఫామ్, ఏ ఒక్కరిపైనో ఆధారపడే పరిస్థితి లేనిరీత్యా డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీని హాట్‌ ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. అతివిశ్వాసానికి పోకుంటే ఆ జట్టుదే టైటిల్‌ అని విశ్లేషిస్తున్నారు. రికార్డు స్థాయిలో కప్‌ను ఒడిసిపట్టిన బ్రెజిల్‌... స్టార్‌ స్ట్రయికర్‌ నెమార్‌నే నమ్ముకుంది. అతడి మెరుపులకు గాబ్రియెల్‌ జీసస్‌ నైపుణ్యం తోడైతే యూరప్‌ గడ్డపై 60 ఏళ్ల తర్వాత విశ్వ విజేతగా ఆవిర్భవిస్తుంది. లియోనల్‌ మెస్సీ మాయతో గత ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా... ఈసారి పావ్‌లో దిబాలా వంటి ప్రతిభావంతులతో బరిలో దిగుతోంది. స్వల్ప దూర పాస్‌ల ‘టికి టకా’ శైలి, సెర్గియో రామోస్‌ నేతృత్వంలో, డేవిడ్‌ సిల్వా, ఆండ్రెస్‌ ఇనెస్టా వంటి అనుభవజ్ఞులున్న స్పెయిన్‌... గ్రీజ్‌మన్, ఎంబాపె స్థాయి ఉన్నత శ్రేణి ఆటగాళ్లతో ఫ్రాన్స్‌ పటిష్ఠంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ స్థాయి ఆటగాళ్లయిన డిబ్రుయెన్, హజార్డ్, మెర్టెన్స్‌లు ఉన్న బెల్జియం గురించి మరీ ముఖ్యంగా చెప్పుకొంటున్నారు. దీంతోపాటు క్రిస్టియానో రొనాల్డో ఆధ్వర్యంలోని పోర్చుగల్, మాజీ చాంపియన్‌ ఉరుగ్వేలను డార్క్‌ హార్స్‌గా పరిగణిస్తున్నారు. 

ఆసియా, ఆఫ్రికా సత్తా ఎంతో! 
ఆసియా జట్లయిన జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్, సౌదీ అరేబియాలలో ఏ రెండైనా సంచలనాలతో రెండోరౌండ్‌కు చేరతాయి. అదృష్టం కలిసొస్తే క్వార్టర్స్‌కూ వెళ్లొచ్చు. అనుభవం, ప్రతిభ ఉన్న ఆఫ్రికా జట్లలో సెనెగల్, మొరాకో ప్రమాదకారులు.  సలా రాణింపుపై ఈజిప్ట్‌ పయనం ఆధారపడి ఉంది.  

సమయం మనకు అనుకూలం... 
మన దేశంలోని ఫుట్‌బాల్‌ అభిమానులు గత ప్రపంచకప్‌ల సందర్భంగా తెల్లవారుజాము మ్యాచ్‌లు, అర్ధరాత్రి పోరాటాలు చూసేందుకు నిద్రను త్యాగం చేయాల్సి వచ్చేది. ఈసారి ఆ అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం కప్‌ జరగనున్న రష్యా వేళలతో పోలిస్తే భారత సమయం రెండున్నర గంటలు ముందుంది. లీగ్‌ దశలో ఈజిప్ట్‌–ఉరుగ్వేల మ్యాచ్‌ ఒక్కటి మధ్యాహ్నం 3.30కు ప్రారంభం అవుతోంది. మిగతావాటిలో చాలావరకు సాయంత్రం 5.30 నుంచి మొదలవుతున్నాయి. ఇంకా సంతోషించాల్సిన సంగతి ఏమంటే... నాకౌట్‌ సహా లీగ్‌ దశలో పెద్దపెద్ద జట్ల మ్యాచ్‌లు రాత్రి 7.30 నుంచి జరగనున్నాయి. తక్కువ సంఖ్యలో మాత్రమే అర్ధరాత్రి వేళ సాగనున్నాయి. కాబట్టి ఐపీఎల్‌ తరహాలోనే ఫిఫా ప్రపంచకప్‌నూ మనం ఎంచక్కా ఆసాంతం ఆస్వాదించవచ్చు. 

డబ్బులే డబ్బులు... విజేత జట్టుకు రూ. 256 కోట్లు ప్రైజ్‌మనీ
దాదాపు మూడేళ్లపాటు శ్రమించి ప్రపంచకప్‌ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించిన జట్లపై కాసుల వర్షం కురుస్తుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే 32 జట్లకూ భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభిస్తుంది. లీగ్‌ దశలో నిష్క్రమించిన జట్లకు 80 లక్షల డాలర్ల చొప్పున (రూ. 54 కోట్లు)... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగిన జట్లకు కోటీ 20 లక్షల డాలర్ల (రూ. 81 కోట్లు) చొప్పున అందజేస్తారు. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన జట్ల ఖాతాలో కోటీ 60 లక్షల డాలర్లు (రూ. 100 కోట్లు) చేరుతాయి. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 2 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 148 కోట్లు)... మూడో స్థానం పొందిన జట్టుకు 2 కోట్ల 40 లక్షల డాలర్లు (రూ. 162 కోట్లు) ప్రైజ్‌మనీగా చెల్లిస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 2 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 189 కోట్లు) చాంపియన్‌గా నిలిచిన జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 256 కోట్లు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి.   

ఆతిథ్య జట్టా? అరేబియానా?
‘ఫిఫా’ ప్రపంచ కప్‌లో భాగంగా ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా మధ్య గురువారం తొలి మ్యాచ్‌ జరగనుంది. మాస్కోలోని లుజ్నికి మైదానం ఇందుకు వేదిక కానుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌ చరిత్రలో ఆతిథ్య జట్టు ప్రారంభ మ్యాచ్‌లో ఓడిపోయిన దాఖలాలు లేవు. గ్రూప్‌ ‘ఎ’లోని ఈ రెండూ సాధారణ జట్లే. ఫిఫా ర్యాంకుల్లో రష్యా 70వ, సౌదీ 67వ స్థానంలో ఉన్నాయి. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవడం, 8 నెలలుగా ఒక్క విజయం లేకపోవడం, గ్రూప్‌లో మిగతా ప్రత్యర్థులు ఉరుగ్వే, ఈజిప్ట్‌లపై నెగ్గడం అంత సులువు కాదు కాబట్టి ఏ విధంగా చూసినా ఈ మ్యాచ్‌... గోల్‌ కీపర్‌ అకిన్‌ఫీవ్‌ సారథ్యంలోని ఆతిథ్య జట్టుకే ఎక్కువ ముఖ్యం. పైగా 2010 కప్‌లో దక్షిణాఫ్రికా తప్ప ఏ ఆతిథ్య దేశమూ లీగ్‌ దశలో వెనుదిరగలేదు. మరోవైపు 2006 తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో ఆడుతున్న సౌదీ జట్టు స్పెయిన్‌లో శిక్షణ తీసుకొని వచ్చింది.  

►200 ఈసారి 32 జట్ల తరఫున బరిలోకి దిగుతున్న 736 ఆటగాళ్లలో 200 మందికి ఒకసారైనా ప్రపంచకప్‌లో ఆడిన అనుభవముంది.  
►4    అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్‌లో ఆడిన నాలుగో ప్లేయర్‌గా మెక్సికో ఆటగాడు రఫా మార్కెజ్‌ గుర్తింపు పొందనున్నాడు. గతంలో ఆంటోనియో కార్‌బజాల్‌ (మెక్సికో), లోథర్‌ మథియాస్‌ (జర్మనీ), గిగి బఫన్‌ (ఇటలీ) ఈ ఘనత సాధించారు. 
►1     ఈసారి ప్రపంచకప్‌లో దేశవాళీ లీగ్‌లో ఆడుతున్న ఆటగాళ్లనే మొత్తం 23 మంది సభ్యుల జట్టులో ఎంపిక చేసిన ఏకైక దేశం ఇంగ్లండ్‌. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా (21), సౌదీ అరేబియా (20) ఉన్నాయి. దేశవాళీ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న ఆటగాళ్లలో ఒక్కరినీ ఎంపిక చేయని జట్లుగా సెనెగల్, స్వీడన్‌ నిలిచాయి. బెల్జియం, ఐస్‌లాండ్, నైజీరియా, స్విట్జర్లాండ్‌ జట్లు మాత్రం ఒక్కొక్కరిని మాత్రమే ఎంపిక చేశాయి.  
►53 ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆటగాళ్లలో 53 మందికి ప్రపంచకప్‌లో గోల్‌ చేసిన పేరుంది. ఈ జాబితాలో థామస్‌ ముల్లర్‌ (జర్మనీ–10 గోల్స్‌) అత్యధికంగా చేశాడు.    

మరిన్ని వార్తలు