సన్‌రైజర్స్‌పైనే ‘రైజింగ్‌’

28 May, 2018 11:34 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11వ సీజన్‌లో ఐదు శతకాలు నమోదయ్యాయి. అందులో నాలుగు శతకాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పైనే రావడం ఒకటైతే, ఆ నాలుగు సందర్భాల్లోనూ ప్రత్యర్థి ఆటగాళ్లు అజేయం నిలవడం మరొకటి. సన్‌రైజర్స్‌పై ఫైనల్‌ పోరులో షేన్‌ వాట్సన్‌(117 నాటౌట్‌) శతకం బాదగా, అంతకుముందు క్రిస్‌ గేల్‌(104 నాటౌట్‌), అంబటి రాయుడు(100 నాటౌట్‌), రిషబ్‌ పంత్‌(128 నాటౌట్‌)లు హైదరాబాద్‌పై సెంచరీలు సాధించి అజేయంగా నిలిచారు. పటిష్టమైన బౌలింగ్‌ లైనప్‌ కల్గిన సన్‌రైజర్స్‌పై వీరంతా ఆధిపత్యం చెలాయించి సెంచరీలతో సత్తాచాటారు.


వాట్సన్‌ అరుదైన ఘనత

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే ఆటగాడు షేన్‌ వాట్సన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక సీజన్‌లో రెండు సెంచరీలు సాధించిన నాల్గో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. లీగ్‌ దశలో రాజస్తాన్‌ రాయల్స్‌పై వాట్సన్‌(106) సెంచరీ నమోదు చేయగా.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై శతకంతో మెరిశాడు. అంతకుముందు ఒక సీజన్‌లో​ రెండు, అంతకంటే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ కోహ్లి ముందంజలో ఉన్నాడు. 2016లో కోహ్లి నాలుగు శతకాలు ఆకట్టుకోగా, 2011లో క్రిస్‌ గేల్‌ రెండు సెంచరీలు సాధించాడు. 2017లో హషీమ్‌ ఆమ్లా రెండు శతకాల్ని నమోదు చేయగా, తాజాగా వారి సరసన వాట్సన్‌ చేరాడు.

మరిన్ని వార్తలు