ఐదో రోజు ఆట ఆశించలేం

28 Jul, 2017 00:28 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌

తొలి టెస్టులో ప్రస్తుతం భారత్‌ పటిష్టస్థితిలో ఉంది. 600 పరుగుల భారీస్కోరు చేయడంతో పాటు, ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో సగం వికెట్లు నేలకూల్చడంతో భారీ ఆధిక్యం ఖాయమైంది. ఇక మాథ్యూస్‌ ఒక్కడిని అవుట్‌ చేస్తే చాలు. మ్యాచ్‌ జరిగే కొద్దీ బంతి స్పిన్‌కు అనుకూలించే అవకాశముంది. తొలిరోజు లంక తమ ప్రదర్శన పట్ల బహుశా నిందించుకొని ఉంటుంది. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ పేలవంగా సాగింది.  ధావన్‌ భారీ సెంచరీ వారి చెత్త ఫీల్డింగ్‌ చలవే! దీంతో పాటు భారత్‌ స్కోరుకు పుజారా సెంచరీ బాగా ఉపయోగపడింది. అయితే లంక రెండో రోజు ఫీల్డింగ్‌లో మెరుగుపడకపోయినా... బౌలింగ్‌ మాత్రం బాగుంది.

నువాన్‌ ప్రదీప్, లాహిరు కుమార చక్కగా బౌలింగ్‌ చేశారు. నిజానికి వీరి జోరుతో లంచ్‌ తర్వాత 600 అసాధ్యంగా కనిపించింది. కానీ అరంగేట్రం హీరో హార్దిక్‌ పాండ్యా మెరుపు అర్ధసెంచరీతో ఆ స్కోరు సాధ్యమైంది. అయితే ఇది కూడా మిస్‌ ఫీల్డింగ్‌ వల్లే సాధ్యపడింది. 4 పరుగుల వద్ద పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ కరుణరత్నే జారవిడవడంతో బతికిపోయిన అతను యథేచ్ఛగా ఆడాడు. షమీ మొదట బ్యాటింగ్‌లో తర్వాత బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ తీశాడు.

ఇక రెండో రోజు ముకుంద్‌ మెరుపు వేగంతో స్పందించి తరంగను రనౌట్‌ చేయడం అద్భుతంగా అనిపించింది. మూడో రోజు మాథ్యూస్‌ సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే గౌరవప్రదమైన స్కోరు చేయగలుగుతుంది. అయినా ఐదో రోజు దాకా మ్యాచ్‌ సాగాలంటే ఇదేమాత్రం సరిపోదు! 

>
మరిన్ని వార్తలు