చివరి రోజు మ్యాచ్‌.. ప్రేక్షకులు లేకుండానే!

12 Mar, 2020 19:18 IST|Sakshi

రాజ్‌కోట్‌: రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్‌ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ తుది అంకానికి చేరుకుంది. రేపు చివరి రోజు మ్యాచ్‌ కావడంతో ఫలితం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. సౌరాష్ట్ర తొలి రంజీ టైటిల్‌ను సాధించాలనే ఆశపడుతుంటే, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బెంగాల్‌ మొదటి టైటిల్‌ కోసం ఉవ్విళ్లూరుతోంది. కాగా, ఈ మ్యాచ్‌ ఆఖరి రోజు ఆటలో ప్రేక్షకులు లేకుండానే జరుగనుంది.  కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ అలర్ట్‌ అయ్యింది. దాంతో ఏ మ్యాచ్‌నైనా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్స్‌తో పాటు బీసీసీఐకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పట్నుంచి మొదలుకొని ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ మ్యాచ్‌లు జరిగే వేదికల్లో ప్రజల్ని అనుమతించరాదనే నిబంధన విధించింది. దాంతో శుక్రవారం రంజీ ఫైనల్‌ చివరి రోజు ఆట ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. దీని ప్రభావం ఐపీఎల్‌పై కూడా పడే అవకాశం ఉంది.(ఐపీఎల్‌ : ఏప్రిల్‌ 15 వరకు ఆ ఆటగాళ్లు దూరం )

ఇప్పటికే ఐపీఎల్‌-13 సీజన్‌ను రద్దు చేయాలంటూ పలువురు కోర్టుల్ని ఆశ్రయించగా, ప్రేక్షకులు రాకుండా మ్యాచ్‌లు నిర్వహించాలనే కేంద్ర నిర్ణయం మరో కొత్త సమస్యను తీసుకొచ్చింది. దీనిపై ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విదేశీ ఆటగాళ్లకు సైతం వీసాల మంజూరులో నిబంధనలు విధించారు.ఏప్రిల్‌ 15 వరకు విదేశీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో విదేశీ క్రికెటర్లు అప్పటివరకూ ఐపీఎల్‌ ఆడటానికి భారత్‌కు వచ్చే చాన్స్‌ లేదు. ఫలితంగా ఐపీఎల్‌పై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయంగా కన్పిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ ప్రారంభం అవుతుందని ఓ వైపు బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ పదే పదే చెప్తున్నా... అది సాధ్యం కాదని, ఐపీఎల్‌ వాయిదా ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్‌ కొనసాగడం అసాధ్యమని అంటున్నారు. అసలు ఐపీఎల్‌ను నిర్వహించాలా..లేక రద్దు చేయాలా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. 

రసపట్టులో ఫైనల్‌..
రంజీ ట్రోఫీ ఫైనల్‌ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 425 పరుగులు చేస్తే దానికి బెంగాల్‌ ధీటుగా బదులిస్తోంది. బుధవారం మూడో రోజు ఆటలో బెంగాల్‌ కష్టాల్లో పడినట్లు కనిపించినప్పటికీ, గురువారం నాల్గో రోజు ఆటలో తేరుకుంది. సుదీప్‌ చటర్జీ(81), సాహా(64), మజుందార్‌( 58 బ్యాటింగ్‌)లు హాఫ్‌ సెంచరీలతో ఆదుకున్నారు. దాంతో బెంగాల్‌ జట్టు నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. ఇంకా 71 పరుగుల వెనుకబడి ఉంది. దాంతో ఈ మార్కును అధిగమించడానికి బెంగాల్‌ యత్నించడం ఖాయం. రంజీ నాకౌట్‌ మ్యాచ్‌లు డ్రా అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం ఉన్నవారినే విజేతగా నిర్ణయిస్తారు. దాంతో మరి బెంగాల్‌ టైటిల్‌ను సాధిస్తుందా.. లేక సౌరాష్ట్ర తొలిసారి ట్రోఫీని అందుకుంటుందా అనేది వేచి చూడాలి. 

>
మరిన్ని వార్తలు