కంగారూలు కుమ్మేశారు

14 Feb, 2015 12:51 IST|Sakshi

మెల్బోర్న్: అరోన్ ఫించ్ (135) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ప్రపంచ కప్ పూల్-ఎలో భాగంగా శనివారం జరుగుతున్న మ్యాచ్లో కంగారూలు .. ఇంగ్లండ్కు 343 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆసీస్ కెప్టెన్ జార్జి బెయిలీ (55), మ్యాక్స్వెల్ (66) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్ ఫిన్ హ్యాట్రిక్ వికెట్ సహా ఐదు వికెట్లు పడగొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లో 9 వికెట్లకు 342 పరుగులు సాధించింది.  ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసింది. కాగా ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వరుస బంతుల్లో ఓపెనర్ వార్నర్ (22), వాట్సన్ (0)ను అవుట్ చేశాడు. స్టీవెన్ స్మిత్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో కంగారూలు కష్టాల్లో పడినట్టు కనిపించారు. అయితే ఫించ్ బాధ్యతాయుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. అతనికి బెయిలీ అండగా నిలిచాడు. బెయిలీ ఆచూతూచి ఆడగా ఫించ్ మెరుపులు మెరిపించాడు.  ఈ క్రమంలో ఫించ్ సెంచరీ, బెయిలీ హాఫ్ సెంచరీ చేశారు.  కాగా ఫించ్ రనౌట్ అవగా, ఆ వెంటనే బెయిలీ.. ఫిన్ బౌలింగ్లో బౌల్డయ్యాడు.  స్కోరు అప్పటికే 200 మార్క్ దాటింది. చివర్లో మ్యాక్స్వెల్, హాడిన్ వేగంగా పరుగులు రాబట్టడంతో స్కోరు 300 దాటింది. చివర్లో ఇంగ్లండ్ బౌలర్లు వెంటవెంటనే వికెట్లు పడగొట్టినా ఆసీస్ భారీ స్కోరు సాధించకుండా ఆపలేకపోయారు.

మరిన్ని వార్తలు