దాయాదితో తొలి పోరు

31 Jul, 2013 01:20 IST|Sakshi
దాయాదితో తొలి పోరు

 మెల్‌బోర్న్: వన్డే ప్రపంచ చాంపియన్ భారత్ 2015 ప్రపంచ కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 15న అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించే ఈ చాంపియన్‌షిప్‌లో 14 వేదికలపై 44 రోజుల పాటు మొత్తం 49 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో 26 మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో, 23 మ్యాచ్‌లు న్యూజిలాండ్‌లో జరుగుతాయి. మార్చి 29న మెల్‌బోర్న్‌లో ఫైనల్ నిర్వహిస్తారు.

మంగళవారం ఇక్కడ జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ, టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పాటు అధికారికంగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వరల్డ్ కప్ జరగనుండడం విశేషం. 1992లో ఇక్కడ జరిగిన టోర్నమెంట్‌ను పాకిస్థాన్ గెలుచుకుంది. ‘50 ఓవర్ల ఆటలో వరల్డ్ కప్ అత్యుత్తమ టోర్నీ. పైగా 2015తో వన్డే వరల్డ్ కప్ ప్రారంభమై 40 ఏళ్లు కూడా పూర్తి కానున్నాయి.
 
 చరిత్రలో అనేక అద్భుత మ్యాచ్‌లు టోర్నీని సుసంపన్నం చేశాయి. మళ్లీ వరల్డ్ కప్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని షెడ్యూల్ విడుదల సందర్భంగా ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ అన్నారు. మరో వైపు టైటిల్ నిలబెట్టుకునేందుకు శ్రమిస్తున్నట్లు భారత కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యాఖ్యానించాడు. ‘సొంత ప్రేక్షకుల మధ్య నిన్న మొన్నే వరల్డ్ కప్ గెలిచినట్లుంది. నాలుగేళ్లకు ఒక సారి వచ్చే ప్రపంచ కప్ అంటే ప్రతీ క్రికెటర్‌కు ప్రత్యేకం. ముంబైలో ఆ ఆనందాన్ని అనుభవించాం. మళ్లీ దానిని నిలబెట్టుకునేందుకు గట్టిగా కృషి చేస్తాం’ అని అతను చెప్పాడు.
 
 బరిలో 14 జట్లు
 2015 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. 10 ప్రధాన జట్లతో పాటు నాలుగు జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల ద్వారా అర్హత సాధిస్తాయి. వీటిలో ఇప్పటికే ఐర్లాండ్ క్వాలిఫై కాగా, మరో మూడు ఇంకా అర్హత సాధించాల్సి ఉంది.
 
 వీటిలో పూల్ ‘ఎ’, పూల్ ‘బి’లుగా విభజించారు. ప్రతీ గ్రూప్‌నుంచి నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరతాయి. అనంతరం సెమీస్, ఫైనల్ జరుగుతాయి. మొదటి సెమీ ఫైనల్‌కు ఆక్లాండ్, రెండో సెమీ ఫైనల్‌కు సిడ్నీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 14న జరిగే చాంపియన్‌షిప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్, శ్రీలంకతో తలపడుతుంది. అదే రోజు మరో ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా, తమ మొదటి పోరులో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను మెల్‌బోర్న్‌లో ఎదుర్కొంటుంది.
 
 వైభవంగా షెడ్యూల్ విడుదల
 సుమారు రెండేళ్ల ముందే ఐసీసీ 2015 ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీనికోసం రెండు దేశాల్లో ఒకే సమయంలో రెండు ఈవెంట్లు నిర్వహించింది. ఆయా దేశాల ప్రధానులతో పాటు ఐసీసీ పెద్దలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 భారత దిగ్గజం కపిల్ దేవ్, శ్రీలంక చీఫ్ సెలక్టర్ సనత్  జయసూర్య మెల్‌బోర్న్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ వెల్లింగ్టన్ (న్యూజిలాండ్)లో జరిగిన వేడుకలో పాలు పంచుకున్నారు. రిచర్డ్ హ్యాడ్లీ, న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ కలిసి పిల్లలతో కొద్దిసేపు క్రికెట్ ఆడారు. అటు మెల్‌బోర్న్‌లో మైక్ హస్సీ, గిల్‌క్రిస్ట్ కలిసి సందడి చేశారు.
 
 వేదికలు
 ఆస్ట్రేలియా: అడిలైడ్, బ్రిస్బేన్, కాన్‌బెర్రా, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ
 న్యూజిలాండ్: ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చ్, డ్యునెడిన్, హామిల్టన్, నేపియర్, నెల్సన్, వెల్లింగ్టన్
 
 గ్రూప్‌ల వివరాలు:
 పూల్ ‘ఎ’: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ 2, క్వాలిఫయర్ 3.
 పూల్ ‘బి’: భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్, క్వాలిఫయర్ 4
 

మరిన్ని వార్తలు