22 ఏళ్ల తర్వాత తొలిసారి..

19 Aug, 2019 11:34 IST|Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ మైదానంలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది.  ఇంగ్లండ్‌ నిర్దేశించిన 267 పరుగుల ఛేదనలో ఆసీస్‌ ఓ దశలో ఓటమి అంచుల వరకూ వెళ్లి గట్టెక్కింది. మార్నస్‌ లబషేన్‌ (100 బంతుల్లో 59; 8 ఫోర్లు)  అద్భుత పోరాటంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. ఆర్చర్‌ బౌలింగ్‌లో గాయపడిన స్టీవ్‌ స్మిత్‌... తల నొప్పి కారణంగా ఆదివారం మైదానంలోకి దిగలేదు. దీంతో ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ వెసులుబాటును ఆస్ట్రేలియా వినియోగించుకుంది. మ్యాచ్‌ రిఫరీ అనుమతితో స్మిత్‌ స్థానంలో ఆ జట్టు లబషేన్‌ను ఆడించింది. దాన్ని వినియోగించుకున్న లబషేన్‌.. ఇంగ్లండ్‌ బౌలర్లకు పరీక్షగా నిలిచి మ్యాచ్‌ డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

కాగా,  1997 నుంచి చూస్తే లార్డ్స్‌లో ఒక యాషెస్‌ టెస్టు డ్రా కావడం ఇదే తొలిసారి. 22 ఏళ్ల తర్వాతా లార్డ్స్‌లో యాషెస్‌ టెస్టు డ్రా కావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. మరొకవైపు 2018 క్రిస్ట్‌చర్చ్‌లో జరిగిన టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌కు ఇదే మొదటి డ్రా.  ఇదిలా ఉంచితే, ఒక దేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ల పరంగా చూస్తే వరుస అత్యధిక ఫలితాలు వచ్చిన జాబితాలో శ్రీలంక తొలి స్థానంలో ఉంది. 2014-19 మధ్య కాలంలో శ్రీలంకలో జరిగిన టెస్టుల్లో 25 వరుస ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోనే అత్యధిక వరుస టెస్టు ఫలితాలు వచ్చాయి. యాషెస్‌ తొలి టెస్టులో ఆసీస్‌ విజయం తర్వాత ఇంగ్లండ్‌లో వరుస విజయాల సంఖ్య 20కు చేరింది. కాగా, యాషెస్‌ రెండో టెస్టు డ్రా కావడంతో ఇంగ్లండ్‌లో వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. (ఇక్కడ చదవండి: భళా.. లబషేన్‌)

>
మరిన్ని వార్తలు