26ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు..

4 Mar, 2018 15:59 IST|Sakshi
1992 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో కిరణ్‌ మోరేను టీజ్‌ చేస్తున్న జావెద్‌ మియాందాద్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: ఏ క్రీడలోనైనా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయంటే అందులో ఉండే మజానే వేరు. ఇక క్రికెట్‌ విషయానికొచ్చేసరికి ఇరు జట్ల మధ్య వేడి మరికాస్త ఎక్కువనే చెప్పాల్పి. ఈ రెండు జట్లు క్రికెట్‌ ఫీల్డ్‌లో దిగాయంటే యుద్ధవాతావరణమే కనబడేది. ప్రధానంగా వరల్డ్‌ కప్‌ వంటి మెగా ఈవెంట్‌లలో భారత్‌-పాకిస్తాన్‌ జట్ల వైరం తారాస్థాయిలో ఉండేది. ఇప్పటివరకూ ఇరు జట్లు వన్డే వరల్డ్‌ కప్‌ ముఖాముఖి పోరులో ఆరుసార్లు తలపడగా, ఈ రెండు జట్ల మధ్య తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సరిగ్గా 26 ఏళ్ల క్రితం జరిగింది. 1992లో పాకిస్తాన్‌ వరల్డ్‌ కప్‌ గెలిచినప్పటికీ, భారత్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఒకసారి చూద్దాం.

బెన్సన్‌ హెడ్జెస్‌ వరల్డ్‌ కప్‌లో భాగంగా మార్చి 4వ తేదీ, 1992లో ఇరు జట్లు మెగా ఈవెంట్‌లో మొదటిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సచిన్‌(54 నాటౌట్‌)కు తోడు అజయ్‌ జడేజా(46), కపిల్‌ దేవ్‌(35), అజహరుద్దీన్‌(32)లు రాణించడంతో భారత్‌ 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

దానిలో భాగంగా బరిలోకి దిగిన పాకిస్తాన్‌ దీటుగా బదులిచ్చేయత్నం చేసింది. ఓపెనర్‌ అమీర్‌ సోహైల్‌ 62 పరుగులకు తోడు జావెద్‌ మియాందాద్‌ 40 పరుగులు సాధించాడు. అయితే ఆ తర్వాత ఘోరంగా విఫలమైన పాకిస్తాన్‌ 173 పరుగులకే ఆలౌటైంది.  దాంతో భారత్‌ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. కపిల్‌ దేవ్‌, మనోజ్‌ ప్రభాకర్‌, జవగల్‌ శ్రీనాథ్‌లు తలో రెండు వికెట్లు తీసి భారత్‌ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ చూస్తే ఇరు జట్లు వన్డే వరల్డ్‌ కప్‌లో తలపడిన అన్నిసార్లూ భారత్‌నే విజయం వరించడం మరో విశేషం.

మరిన్ని వార్తలు