‘ధోని’ సినిమా చూపిస్తున్నాడు!

26 Sep, 2014 00:31 IST|Sakshi
‘ధోని’ సినిమా చూపిస్తున్నాడు!

- తెరపై భారత క్రికెట్ కెప్టెన్ బయోగ్రఫీ
- ధోని పాత్ర పోషిస్తున్న సుశాంత్ రాజ్‌పుత్
ముంబై: క్రికెట్ ప్రపంచంలో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఇప్పుడు సినిమాగా తెరకెక్కనుంది. సాధారణ కుటుంబ నేపథ్యంనుంచి వచ్చి భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగిన అతను ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతని జీవితంలోని అనేక మలుపులు, విశేషాలతో ‘ఎం.ఎస్. ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో సినిమా రూపొందుతోంది. ధోని గురించి క్రికెట్ వీరాభిమానులకు కూడా తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో చూపించనున్నారు. ‘ఎ వెడ్నస్ డే’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ పాండే దీనికి దర్శకత్వం వహిస్తుండగా...‘కై పో చే’ చిత్రంలో వెలుగులోకి వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు.

ధోని నాయకత్వంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలిచి సరిగ్గా ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ధోనికే చెందిన ఇన్‌స్పైర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్- రితి స్పోర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. క్రీడాకారుల జీవిత చరిత్రతో ఇటీవల రూపొందించిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. వచ్చే ఏడాది ధోని సినిమా విడుదలవుతుంది. గతంలోనే ధోనిపై సినిమా నిర్మాణంలో ఉందని, అయితే బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిని కొట్టిపారేసిన బోర్డు, ధోని ప్రొఫెషనల్ కెరీర్‌కు సమస్య రానంత వరకు అతని సినిమాపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు