తొలి వన్డేలో భారత్ ఓటమి

14 Oct, 2013 00:22 IST|Sakshi
తొలి వన్డేలో భారత్ ఓటమి

బ్యాటింగ్‌లో ఎలాంటి మెరుపులు లేవు. దూకుడు అస్సలే కనిపించలేదు. గతంలో అనేక సార్లు అలవోకగా ఛేదించిన లక్ష్యానికి కనీసం చేరువలోకి కూడా వెళ్లలేక ధోని సేన చేతులెత్తేసింది. మితిమీరిన విశ్వాసమో, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడమో కానీ తొలి వన్డేలో భారత్ బోర్లా పడింది. టెస్టుల్లో ఎంతటి చెత్త ప్రదర్శన కనబర్చినా... వన్డేల్లో మాత్రం భారత గడ్డపై ఉన్న మెరుగైన రికార్డును నిలబెట్టుకుంటూ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది.
 
 పుణే: ఏకైక టి20 మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి ఆస్ట్రేలియా వెంటనే కోలుకుంది. ఏడు వన్డేల సిరీస్‌లో శుభారంభం అందుకుంది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 72 పరుగుల ఆధిక్యంతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ బెయిలీ (82 బంతుల్లో 85; 10 ఫోర్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాడు.

 
 ఆరోన్ ఫించ్ (79 బంతుల్లో 72; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి చెలరేగగా... హ్యూస్ (53 బంతుల్లో 47; 5 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (85 బంతుల్లో 61; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ (47 బంతుల్లో 42; 6 ఫోర్లు), రైనా (45 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్క్‌నర్ (3/47) రాణించాడు. వాట్సన్, మెక్‌కే చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్‌లో భాగంగా రెండో వన్డే బుధవారం జైపూర్‌లో జరుగుతుంది.
 
 ఓపెనర్ల శుభారంభం
 టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు హ్యూస్, ఫించ్ ఆచితూచి ఆడారు. తొలుత ఆసీస్ తొలి ఆరు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఏడో ఓవర్ నుంచి ఆసీస్ జోరు మొదలైంది. భువనేశ్వర్ వేసిన ఆ ఓవర్లో ఫించ్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. ఇద్దరు ఓపెనర్లు చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. 54 బంతుల్లో ఫించ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, భాగస్వామ్యం కూడా వంద పరుగులు దాటింది.
 
 కట్టడి చేసిన యువీ, జడేజా
 19వ ఓవర్ రెండో బంతికి భారత్‌కు తొలి బ్రేక్ లభించింది. జడేజా బంతిని ఫ్లిక్ చేయబోయి హ్యూస్ లెగ్‌స్లిప్‌లో ఉన్న రైనాకు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్ పడింది. ఆ వెంటనే ఆసీస్‌కు యువరాజ్ షాక్ ఇచ్చాడు. తాను వేసిన తొలి బంతికే అతను వాట్సన్ (2)ను పెవిలియన్ పంపించాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత యువీకి ఇదే మొదటి వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత కొద్ది సేపటికే దూకుడుగా ఆడుతున్న ఫించ్‌ను కూడా అవుట్ చేసిన యువీ... డెరైక్ట్ త్రోతో వోజెస్ (7)ను రనౌట్ చేశాడు. మరోవైపు కెప్టెన్ బెయిలీ మాత్రం జోరు తగ్గనివ్వలేదు. చివర్లో ఫాల్క్‌నర్ (22 బంతుల్లో 27; 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడటంతో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటింది.
 
 కోహ్లి మినహా
 భారత ఇన్నింగ్స్ కూడా నెమ్మదిగానే ప్రారంభమైంది. క్రీజ్‌లో నిలదొక్కుకోవడంలో ఇబ్బంది పడిన శిఖర్ ధావన్ (7) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రోహిత్ అవుటయ్యాక కోహ్లి, రైనా కలిసి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం ఫాల్క్‌నర్ ఈ జోడీని విడదీశాడు. భారీ సిక్స్‌తో పరుగుల ఖాతా తెరచిన యువరాజ్ (7) ఈసారి ఎలాంటి వీరంగం సృష్టించకుండానే అవుటయ్యాడు. నిలకడగా ఆడుతున్న కోహ్లి నిష్ర్కమణ తర్వాత... రవీంద్ర జడేజా (11), కెప్టెన్ ధోని (19) కూడా పెవిలియన్ చేరు కోవడంతో భారత పరాజయం ఖాయమైంది.
 
 స్కోరు వివరాలు
 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హ్యూస్ (సి) రైనా (బి) జడేజా 47; ఫించ్ (సి) కోహ్లి (బి) యువరాజ్ 72; వాట్సన్ (సి) జడేజా (బి) యువరాజ్ 2; బెయిలీ (సి) రైనా (బి) అశ్విన్ 85; వోజెస్ (రనౌట్) 7; మ్యాక్స్‌వెల్ (సి) రోహిత్ (బి) వినయ్ 31; హాడిన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; ఫాల్క్‌నర్ (సి) వినయ్ (బి) ఇషాంత్ 27; జాన్సన్ (నాటౌట్) 9; మెక్‌కే (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 3) 3; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 304
 వికెట్ల పతనం: 1-110; 2-113; 3-146; 4-172; 5-214; 6-231; 7-264; 8-293.
 బౌలింగ్: భువనేశ్వర్ 7-2-41-0; వినయ్ కుమార్ 9-1-68-1; ఇషాంత్ 7-0-56-1; అశ్విన్ 10-0-55-2; జడేజా 10-0-35-1; కోహ్లి 1-0-12-0; యువరాజ్ 6-0-34-2.
 భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ (సి) హాడిన్ (బి) ఫాల్క్‌నర్ 7; రోహిత్ శర్మ (సి) హ్యూస్ (బి) వాట్సన్ 42; కోహ్లి (ఎల్బీ) (బి) వాట్సన్ 61; రైనా (సి) డోహర్తి (బి) ఫాల్క్‌నర్ 39; యువరాజ్ (సి) హ్యూస్ (బి) జాన్సన్ 7; ధోని (బి) మెక్‌కే 19; రవీంద్ర జడేజా (సి) బెయిలీ (బి) ఫాల్క్‌నర్ 11; అశ్విన్ (సి) వాట్సన్ (బి) మెక్‌కే 5; భువనేశ్వర్ (సి) వోజెస్ (బి) ఫించ్ 18; వినయ్ కుమార్ (బి) వోజెస్ 11; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు (బై 2, లెగ్‌బై 4, వైడ్ 5) 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 232
 వికెట్ల పతనం: 1-26; 2-66; 3-137; 4-147; 5-166; 6-192; 7-196; 8-200; 9-230; 10-232.
 
 బౌలింగ్: జాన్సన్ 10-0-38-1; మెక్‌కే 10-0-36-2; ఫాల్క్‌నర్ 8-0-47-3; డోహర్తి 10-1-54-0; వాట్సన్ 8-0-31-2; వోజెస్ 3-0-18-1; ఫించ్ 0.4-0-2-1.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు