హఫీజ్ డబుల్ సెంచరీ

1 May, 2015 01:33 IST|Sakshi
హఫీజ్ డబుల్ సెంచరీ

పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 537/5
బంగ్లాతో తొలి టెస్టు
 

కుల్నా: బంగ్లాదేశ్‌తో వన్డే, టి20 సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు టెస్టు సిరీస్‌లో మాత్రం నిలకడగా ఆడుతోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ స్కోరుకు పాక్ జట్టు భారీస్కోరుతోనే దీటైన జవాబు ఇచ్చింది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (332 బంతుల్లో 224; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ చేయడంతోపాటు మరో నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు సాధించడంతో... మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 148 ఓవర్లలో 5 వికెట్లకు 537 పరుగులు చేసి 205 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అసద్ షఫీక్ (51 బ్యాటింగ్; 5 ఫోర్లు), సర్ఫరాజ్ అహ్మద్ (51 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు.

ఓవర్‌నైట్ స్కోరు 227/1తో ఆట కొనసాగించిన పాక్ ఇన్నింగ్స్‌లో హఫీజ్ కీలక భాగస్వామ్యాలతో చెలరేగాడు. బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ పరుగుల వరద పారించాడు. అజహర్ అలీ (83; 4 ఫోర్లు, సిక్సర్)తో కలిసి రెండో వికెట్‌కు 227; యూనిస్ ఖాన్ (33)తో కలిసి మూడో వికెట్‌కు 62; మిస్బా (59; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన అసద్ షఫీక్ కూడా సమయోచితంగా రాణించాడు.

మిస్బాతో కలిసి ఐదో వికెట్‌కు 66; సర్ఫరాజ్‌తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించడంతో పాక్ భారీ స్కోరు ఖాయమైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3, షివుగటా 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా