47 ఏళ్ల తర్వాత తొలిసారి..

16 Sep, 2019 11:32 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌పై గడ్డపై యాషెస్‌ సిరీస్‌ను గెలిచి ఆసీస్‌కు చాలా కాలమే అయ్యింది. ఎప్పుడో 2001లో స్టీవ్‌ వా నేతృత్వంలోని ఇంగ్లండ్‌లో యాషెస్‌ గెలిచిన ఆసీస్‌కు ఈసారి ఆ అవకాశం అందినట్లే అంది చేజారింది. చివరి టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించడంతో ఆసీస్‌ సుదీర్ఘ కల నెరవేరలేదు. ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌ 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆసీస్‌ 263 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ విజృంభించడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంచితే, ఒక యాషెస్‌ సిరీస్‌ సమం కావడం 47 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. మళ్లీ సుమారు ఐదు దశాబ్దాల తర్వాత అది పునరావృతం కావడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. చివరిసారి 1972లో యాషెస్‌ సిరీస్‌ డ్రాగా ముగిసింది.  అప్పుడు డ్రాగా ముగిసిన యాషెస్‌ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగింది. అయితే తాజా యాషెస్‌ సిరీస్‌ డ్రా ముగిసినప్పటికీ టైటిల్‌ను ఆసీస్‌ నిలుపుకున్నట్లయ్యింది. 2017-18 సీజన్‌లో యాషెస్‌ను ఆసీస్‌ గెలిచిన సంగతి తెలిసిందే.

గావస్కర్‌ సరసన స్మిత్‌
ఈ యాషెస్‌ సిరీస్‌లో విశేషంగా రాణించిన ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌. ఆసీస్‌ విజయాల్లో స్మిత్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో మొత్తంగా  774 పరుగులు సాధించాడు. సుమారు 110 సగటుతో పరుగుల మోత మోగించాడు. అయితే ఒక ఆటగాడు కనీసం నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సిరీస్‌ పరంగా చూస్తే విండీస్‌ దిగ్గజ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌(829 పరుగులు, 1976లో) తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు స్మిత్‌. భారత దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. 1971 తన అరంగేట్రపు టెస్టు సిరీస్‌లో గావస్కర్‌ 774 పరుగులు సాధించాడు. దాంతో గావస్కర్‌ సరసన స్మిత్‌ నిలిచాడు. ఈ జాబితాలో రెండు, నాలుగు స్థానాల్లో స్మిత్‌ ఉండటం విశేషం. 2014-15 సీజన్‌లో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మిత్‌ 769 పరుగులు సాధించాడు. ఈ యాషెస్‌ సిరీస్‌ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ అయినప్పటికీ స్మిత్‌ నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. గాయం కారణంగా మూడో టెస్టుకు స్మిత్‌ దూరమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు