క్రికెట్‌ చరిత్రలో తొలి బౌలర్‌గా..

25 Dec, 2017 11:23 IST|Sakshi

హమిల్టన్‌: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్, కీపర్, స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నవారు హెల్మెట్  పెట్టుకోవడం సాధారణ విషయం. అంతేకాకుండా డేంజర్‌ జోన్‌లో ఫీల్డింగ్‌ చేసే వారు సైతం​ హెల్మెట్‌లను ధరించడం మనం చూశాం. అయితే తాజాగా ఓ బౌలర్‌ హెల్మెట్‌ పెట్టుకుని బౌలింగ్‌ చేసిన  ఘటన న్యూజిలాండ్‌ దేశవాళీ టీ 20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది.


న్యూజిలాండ్ సీమర్ వారెన్ బార్నెస్ తలకు హెల్మెట్‌కు పెట్టుకుని బౌలింగ్‌ చేశాడు. దాంతో ఇప్పటివరకూ క్రికెట్‌లో కొనసాగుతున్న సంప్రదాయానికి బార్నెస్‌ చెక్‌ పెట్టాడు. హమిల్టన్‌ వేదికగా సెడాన్‌ పార్క్‌లో ఒటాగో-నార్తరన్ నైట్స్ మధ్య  జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

 
తొలుత నార్తరన్ నైట్స్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్‌ కాలుకు బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి తాకింది. ఆ బంతి తలకి తాకి ఉంటే ఇంకేమైనా ఉందా? అని భావించిన వారెన్ తాను బౌలింగ్ వేస్తున్నప్పుడు బేస్‌బాల్ అంపైర్ ధరించే హెల్మెట్‌ను పెట్టుకుని మరీ బౌలింగ్ వేశాడు. మ్యాచ్ అనంతరం తాను హెల్మెట్ ధరించడాన్ని వారెన్ సమర్థించుకున్నాడు. బౌలింగ్ చేసేటప్పుడు తన తల నేరుగా బ్యాట్స్‌మెన్‌ వైపే ఉంటుందని, కాబట్టి బ్యాట్స్‌మెన్ కొట్టే బంతి తలకు తాకే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో క్రికెట్‌ చరిత్రలో బౌలింగ్ వేసే సమయంలో హెల్మెట్ ధరించిన తొలి బౌలర్‌గా బార్నెస్  గుర్తింపు పొందాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు