బ్యాట్‌ ఝుళిపించి.. గెలిపించిన లెస్బియన్‌ జంట‌!

14 Nov, 2018 13:42 IST|Sakshi
డేన్‌ వాన్‌ నికెర్క్, మరిజాన్‌ కాప్‌ ( పెళ్లి నాటి ఫొటో)

శ్రీలంకపై కీలక భాగస్వామ్యం

జూలైలో వివాబంధంతో ఒక్కటైన మహిళా క్రికెటర్లు

ప్రొవిడెన్స్‌ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో కని విని ఎరగని రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య గత సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓ లెస్బియన్‌ జంట అద్భుత ప్రదర్శనతో తమ జట్టును గెలిపించింది. ఇలా ఓ లెస్బియన్‌ జంట బ్యాట్‌తో రాణించడం క్రికెట్‌ ప్రపంచంలోనే తొలిసారి. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్, ఆల్‌రౌండర్‌ మరిజాన్‌ కాప్‌లు ఈ ఏడాది జూలైలో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. సఫారీ దేశంలో ఇద్దరు మహిళల వివాహంపై ఎటువంటి ప్రతిబంధకాలు లేకపోవడం వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. దీంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ లెస్బియన్‌ జంట మూడో వికెట్‌కు 67 పరుగులు జత చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లోనే ఈ ఇద్దరు టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకోవడం విశేషం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక మహిళలు 8 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన సఫారి మహిళల్లో డేన్‌ వాన్‌ నికెర్క్ (33 నాటౌట్‌), మరిజాన్‌ కాప్‌(38)ల లెస్బియన్‌ జంట రాణించడంతో ఆ జట్టు 18.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌ను సహచరి లియా తహుహు పెళ్లాడింది.

మరిన్ని వార్తలు