తొలి డే/నైట్ టెస్టుకు పాటిన్సన్!

19 Nov, 2015 19:10 IST|Sakshi
తొలి డే/నైట్ టెస్టుకు పాటిన్సన్!

మెల్ బోర్న్: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగే చివరిదైన డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ పాటిన్సన్ కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ వీడ్కోలు పలకడంతో ఆస్థానంలో పాటిన్సన్ కు అవకాశం కల్పించారు.  దీనిలో భాగంగా ఆసీస్ 13 మంది సభ్యుల బృందంలో పాటిన్సన్ పేరును చేర్చారు.  నవంబర్ 27 నుంచి అడిలైడ్ లో ఇరు జట్ల మధ్య జరుగనున్న చివరిటెస్టు ఆరంభానికి ముందు పాటిన్సన్ తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది.

 

తాజాగా జట్టులో తిరిగి చోటు దక్కడంతో ఆశ్చర్చం వ్యక్తం చేశాడు పాటిన్సన్.  తాను ఎప్పుడూ వంద మైళ్ల వేగంతో బౌలింగ్ వేయడంతోనే తరచు గాయపడుతున్నానని  పేర్కొన్నాడు.  పీటర్ సిడెల్ తో కలిసి జాన్సన్ ఎప్పుడూ బౌలింగ్ అటాక్ ను పంచుకునేవాడని  ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.  ప్రస్తుతం తన ఫిట్ నెస్ పై ఎటువంటి అనుమానాలు లేవన్నాడు. ఇటీవల రెండు దేశవాళీ మ్యాచ్ ల్లో 40 ఓవర్లకు పైగా బౌలింగ్ వేసినట్లు తెలిపాడు. ఇప్పుడు తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని..  ఇక తదుపరి టెస్టుపైనే దృష్టి నిలిపినట్లు పాటిన్సన్ పేర్కొన్నాడు. కొంతకాలంగా దీర్ఘకాలిక నడుం నొప్పితో పాటు తొడ కండరాలు పట్టేయడంతో పాటిన్సన్  జట్టుకు దూరంగా ఉన్నాడు.  గత ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాటిన్సన్ చివరిసారి ఆడాడు. ఇప్పటివరకూ 13 టెస్టులు ఆడిన పాటిన్సన్ 51 వికెట్లను తీశాడు.

మరిన్ని వార్తలు