అదే కథ... అదే వ్యథ

18 Jan, 2018 02:04 IST|Sakshi

రెండో టెస్టులోనూ భారత్‌ పరాజయం  

135 పరుగులతో దక్షిణాఫ్రికా విజయం

లుంగీ ఇన్‌గిడికి 6 వికెట్లు 

సిరీస్‌ 2–0తో సఫారీల సొంతం

24 నుంచి చివరి టెస్టు   

ఏదో అద్భుతం జరిగిపోతుందని ఎవరూ ఊహించలేదు. కానీ కొంత ప్రయత్నం, పోరాటానికి మాత్రం ఆస్కారం ఉందని అనిపించింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం, బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉన్నవారు ఇంకా ఉండటంతో ఏదో మూల ఆశ! కానీ భారత్‌ అలాంటి ఆలోచనలకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మన ఆట ముగిసేందుకు మరో 27.2 ఓవర్లు మాత్రమే సరిపోయాయి. మొదటి టెస్టు ఆడుతున్న   ఇన్‌గిడి, రబడ ధాటికి బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో విదేశీ గడ్డపై మరో పరాజయం టీమిండియా ఖాతాలో చేరగా...   సిరీస్‌  సఫారీ చేతికి చిక్కింది. 

బ్యాటింగ్‌లో పట్టుదల, నిర్దాక్షిణ్యమైన బౌలింగ్, అంతకంటే అద్భుతమైన ఫీల్డింగ్‌ వెరసి దక్షిణాఫ్రికాకు సెంచూరియన్‌లో విజయాన్ని అందించాయి. మరోవైపు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా విఫలమైన కోహ్లి సేన ఏమాత్రం పోటీనివ్వకుండా తలవంచింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఒక్కడే 153 పరుగులు చేస్తే... రెండో ఇన్నింగ్స్‌లో జట్టు మొత్తం కలిసి చేసింది 151 మాత్రమే. సిరీస్‌ గెలవాలన్న కల ఎలాగూ పోయింది. ఇక మిగిలింది వాండరర్స్‌ మైదానంలో పరువు నిలబెట్టుకోవడమే.   
 
సెంచూరియన్‌:
దక్షిణాఫ్రికా జట్టు రెండేళ్ల క్రితం భారత గడ్డపై ఎదురైన పరాజయానికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా రెండు టెస్టుల్లో టీమిండియాను చిత్తు చేసి సిరీస్‌ సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 135 పరుగుల భారీ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ శర్మ (74 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కొద్దిగా పోరాడటం మినహా మిగతావాళ్లంతా విఫలమయ్యారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లుంగీ ఇన్‌గిడి 6 వికెట్లు పడగొట్టగా, రబడకు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో గెలుచుకుంది. చివరిదైన మూడో టెస్టు ఈ నెల 24 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.  

వరుస కట్టి... 
ఓవర్‌నైట్‌ స్కోరు 35/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 116 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. లంచ్‌ విరామానికి ముందే భారత్‌ పోరాటం ముగిసింది. ఐదో రోజు లుంగీ ఇన్‌గిడి నాలుగు వికెట్లతో భారత్‌ పని పట్టాడు. మరో రెండు వికెట్లు రబడ ఖాతాలో చేరగా, పుజారా (19) స్వయంకృతాపరాధంతో మ్యాచ్‌లో రెండోసారి రనౌటయ్యాడు. బుధవారం నాలుగో ఓవర్‌ తొలి బంతిని పార్థివ్‌ గల్లీ వైపు ఆడాడు. దానిని ఆపేందుకు ఇన్‌గిడి, డివిలియర్స్‌ ఇద్దరూ పరుగెత్తారు. అప్పటికే రెండు పరుగులు పూర్తి చేసిన పుజారా ఏబీని తక్కువగా అంచనా వేస్తూ మూడో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే డివిలియర్స్‌ విసిరిన త్రో కచ్చితత్వంతో కీపర్‌ వద్దకు రావడం, డి కాక్‌ వికెట్లు పడగొట్టడం వెంటనే జరిగిపోయాయి. కొద్ది సేపటికే తప్పుడు పుల్‌ షాట్‌ ఆడిన పార్థివ్‌ (19) ఫైన్‌ లెగ్‌లో మోర్కెల్‌ చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆదుకుంటారనుకున్న పాండ్యా (6), అశ్విన్‌ (3)లను ఇన్‌గిడి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించడంతో భారత్‌ అప్పటికే ఆశలు కోల్పోయింది. ఈ దశలో రోహిత్, షమీ (24 బంతుల్లో 28; 5 ఫోర్లు) ధాటిగా ఆడి ఎనిమిదో వికెట్‌కు 61 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. అయితే ఇది ఎంతో సేపు సాగలేదు. రబడ బౌలింగ్‌లో రోహిత్‌ హుక్‌ చేయగా, ఫైన్‌ లెగ్‌లో డివిలియర్స్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. ఆ వెంటనే షమీ పని పట్టి ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఇన్‌గిడి... తన తర్వాతి ఓవర్లో బుమ్రా (2)ను అవుట్‌ చేసి భారత్‌ ఆట ముగించాడు.  

స్కోరు వివరాలు 
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 335; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 307; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 258; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మురళీ విజయ్‌ (బి) రబడ 9; లోకేశ్‌ రాహుల్‌ (సి) మహరాజ్‌ (బి) ఇన్‌గిడి 4; చతేశ్వర్‌ పుజారా (రనౌట్‌) 19; విరాట్‌ కోహ్లి (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 5; పార్థివ్‌ పటేల్‌ (సి) మోర్కెల్‌ (బి) రబడ 19; రోహిత్‌ శర్మ (సి) డివిలియర్స్‌ (బి) రబడ 47; హార్దిక్‌ పాండ్యా (సి) డి కాక్‌ (బి) ఇన్‌గిడి 6; అశ్విన్‌ (సి) డి కాక్‌ (బి) ఇన్‌గిడి 3; షమీ (సి) మోర్కెల్‌ (బి) ఇన్‌గిడి 28; ఇషాంత్‌ శర్మ (నాటౌట్‌) 4; జస్‌ప్రీత్‌ బుమ్రా (సి) ఫిలాండర్‌ (బి) ఇన్‌గిడి 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50.2 ఓవర్లలో ఆలౌట్‌) 151. 

వికెట్ల పతనం: 1–11; 2–16; 3–26; 4–49; 5–65; 6–83; 7–87; 8–141; 9–145; 10–151. 

బౌలింగ్‌: ఫిలాండర్‌ 10–3–25–0; రబడ 14–3–47–3; ఇన్‌గిడి 12.2–3–39–6; మోర్కెల్‌ 8–3–10–0; మహరాజ్‌ 6–1–26–0.  

1 కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ తొలిసారి సిరీస్‌ కోల్పోయింది. 2015లో శ్రీలంకతో సిరీస్‌ నుంచి మొదలు పెడితే వరుసగా 9 సిరీస్‌లు నెగ్గిన తర్వాత భారత్‌కు ఎదురైన పరాజయం ఇది. అయితే 2010 నుంచి ఉపఖండం బయట (వెస్టిండీస్‌ను మినహాయిస్తే) ఎనిమిది సిరీస్‌లు ఆడిన టీమిండియా ఒక్కటి కూడా గెలవలేకపోయింది. 7 ఓడగా... 1 డ్రా చేసుకుంది.  

1  రెండు ఇన్నింగ్స్‌లలోనూ రనౌట్‌ అయిన మొదటి భారత బ్యాట్స్‌మన్‌ పుజారా.  

7 తొలి టెస్టులోనే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న ఏడో దక్షిణాఫ్రికా ఆటగాడు ఇన్‌గిడి.   

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌పై మ్యాచ్‌ ఫీజులో 40 శాతం... జట్టులోని మిగతా సభ్యులకు ఐసీసీ 20 శాతం జరిమానా విధించింది.

మరిన్ని వార్తలు