పాక్‌లో ఫిక్సింగ్ ముసలం!

20 Feb, 2014 01:21 IST|Sakshi

 కరాచీ: వివాదాలకు చిరునామా అయిన పాకిస్థాన్ క్రికెట్‌లో మరో కలకలం రేగింది. ఇటీవల ముగిసిన జాతీయ టి20 చాంపియన్‌షిప్‌లో ఓ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ మాజీ టెస్టు క్రికెటర్ బాసిత్ అలీ ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణలతో అప్రమత్తమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ మేనేజర్ కల్నల్ వసీం, షఫీక్ అహ్మద్, అలీ నక్విలతో కమిటీ ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీ 15 రోజుల్లో విచారణ జరిపి నివేదికను సమర్పిస్తుంది. సియాల్ కోట్ స్టాలిన్స్-కరాచీ డాల్ఫిన్స్ మధ్య రావల్పిండిలో జరిగిన మ్యాచ్‌లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో కరాచీ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌పైనే బాసిత్ అలీ ఆరోపణలు చేశాడు. దీంతో కెప్టెన్ షోయబ్ మాలిక్‌తో పాటు జట్టులోని క్రికెటర్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
 

మరిన్ని వార్తలు