'టీ 20లో ఆ చెత్త రూల్ను మార్చండి'

15 May, 2016 17:55 IST|Sakshi
'టీ 20లో ఆ చెత్త రూల్ను మార్చండి'

కోల్కతా:అంతర్జాతీయ క్రికెట్లో వర్షం కారణంగా మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే డక్ వర్త్ లూయిస్ పద్ధతిపై పుణె సూపర్ జెయింట్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మండిపడ్డాడు. మ్యాచ్ ను ఉన్నపళంగా కుదించే ఈ పద్ధతి నిజంగా పనికిమాలినదిగా అభివర్ణించాడు. కనీసం పొట్టి ఫార్మాట్లోనైనా డక్ వర్త్ లూయిస్ పద్ధతికి చరమగీతం పాడాలని ఫ్లెమింగ్ డిమాండ్ చేశాడు. 'డక్వర్త్ లూయిస్ పద్ధతి పనికిమాలినది. ఎప్పుడైతే డక్ వర్త్ లూయిస్కు వెళ్లామో అప్పుడే మ్యాచ్ దాదాపు వన్ సైడ్ అయిపోతుంది. ఇదే విషయాన్నికొన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నా ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. కనీసం టీ 20ల్లోనైనా వర్షం వల్ల మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే ప్రస్తుత డక్ వర్త్ లూయిస్ పద్ధతిని మార్చండి' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

శనివారం కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనిపై ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. డక్ వర్త్ లూయిస్ వల్లే తాము పరాజయం చెందినట్లు పేర్కొన్నాడు. పిచ్ టర్న్ అవుతున్న కారణంగానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నామన్నాడు. ఈ వికెట్పై 135 పరుగులను ఛేదించడం చాలా కష్టమని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. అయితే తమ ఇన్నింగ్స్ చివర్లో ఉండగా వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ అమలు చేయడంతో పూర్తిగా ఆడకుండానే ఓటమి చెందామన్నాడు.  ఎప్పుడైతే డక్ వర్త్కు వెళ్లామో అప్పుడే మ్యాచ్ దాదాపు ముగిసి పోవడం ఎంతవరకూ సరైన పద్ధతని ఫ్లెమింగ్ ప్రశ్నించాడు. 
 

మరిన్ని వార్తలు