వరల్డ్‌కప్‌కు కేదార్‌ జాదవ్‌ దూరమైతే..?

6 May, 2019 16:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు కేదార్‌ జాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బౌండరీని ఆపబోయి జాదవ్‌ గాయపడ్డాడు. దాంతో అతన్ని మైదానం నుంచి తరలించారు. అదే సమయంలో సీఎస్‌కే శిబిరం నుంచి కూడా జాదవ్‌ తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌తో జరుగనున్న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు జాదవ్‌ దూరమయ్యాడు. కాగా, వరల్డ్‌కప్‌కు ఎంపికైన జట్టులో ఉన్న కేదార్‌ జాదవ్‌ ఫిట్‌నెస్‌ అనుమానాలు నెలకొన్నాయి.

ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్‌ వేదిక వరల్డ్‌కప్‌ ఆరంభం కానుండగా, జాదవ్‌ ముందుగానే ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఇంగ్లిష్‌ గడ్డపై భారత జట్టు అడుగుపెట్టే సమయానికి జాదవ్‌ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోలేకపోతే ఆ మెగాటోర‍్నీలో ఆడటం కష్టమే. టీమిండియా మేనేజ్‌మెంట్‌ కానీ, సెలక్టర్లు కానీ జాదవ్‌ గాయం అంత సీరియస్‌ కాదని పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్పప్పటికీ, లోపల మాత్రం అతని గాయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్‌ జట్టు మే 22వ తేదీన ఇంగ్లండ్‌కు పయనం కానున్న తరుణంలో ముందుగానే అతనికి ప్రత్యామ్నాయంగా ఎవర్ని పంపాలనే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జాదవ్‌ అందుబాటులోకి రాకపోతే స్టాంబ్‌ బైలో ఉన్న అంబటి రాయుడ్ని కానీ యువ సంచలనం రిషభ్‌ పంత్‌ను కానీ ఇంగ్లండ్‌కు పంపే అవకాశం ఉంది.

గత ఏడాది ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో కూడా జాదవ్‌ గాయపడి మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు ప్లేఆఫ్‌ ముందు జాదవ్‌ గాయ పడటం గమనార్హం. ఈ సీజన్‌లో జాదవ్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోయినప్పటికీ కీలక సమయంలో జట్టుకు ఆల్‌రౌండర్‌ దూరం కావడం సీఎస్‌కే ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.

దీనిపై సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘ కేదార్‌కి ప్రస్తుతం ఎక్స్-రే నిర్వహించాము. రేపు అతనికి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. అతను కోలుకుంటాడని కోరుకుంటున్నా. అతన్ని ఇక జట్టులోకి తీసుకోము. ఎందుకంటే వరల్డ్ కప్‌ కోసం అతను ఫిట్‌గా ఉండటం ముఖ్యం. అది అంత పెద్ద గాయంలా కనిపించడం లేదు. కానీ మంచి జరగాలనే కోరుకుంటున్నాం’ అని తెలిపాడు.

మరిన్ని వార్తలు