భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం పీకే బెనర్జీ అస్తమయం

21 Mar, 2020 04:08 IST|Sakshi
1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత జట్టు సభ్యులతో పీకే బెనర్జీ

ప్లేయర్‌గా, కెప్టెన్‌గా, కోచ్‌గా 51 ఏళ్ల పాటు సేవలు

1956, 1960 ఒలింపిక్స్‌లలో దేశానికి ప్రాతినిధ్యం

1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టు సభ్యుడు

క్రీడాలోకం దిగ్భ్రాంతి 

ప్రదీప్‌ కుమార్‌ బెనర్జీ అన్నా... పీకే బెనర్జీ అన్నా... నేటితరంలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ భారత ఫుట్‌బాల్‌కు బాగా తెలుసు. ఎందుకంటే ఆటగాడిగా, కెప్టెన్‌గా, చివరకు కోచ్‌గా ఆయన ఫుట్‌బాల్‌ క్రీడకు ఐదు దశాబ్దాలకు పైగా విశేష సేవలందించారు. అందుకే కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ మొదలైందే తడవుగా ఈ అవార్డు పొందిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా పీకే బెనర్జీ ఘనత వహించారు. ఇంతటి చరిత్ర ఉన్న అలనాటి దిగ్గజానికి భారత సాకర్‌ సెల్యూట్‌ చేస్తోంది.  

న్యూఢిల్లీ: ‘కోల్‌కతా మైదాన్‌’కు కళ్లు ఉంటే కన్నీరుమున్నీరయ్యేది. తన మట్టిపై ఆటలాడిన అడుగులు ఎంతో ఎత్తుకు ఎదిగి... దిగ్గజంగా అస్తమయం అయితే కారేది కన్నీరేగా! శుక్రవారం అదే జరిగింది. భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం ప్రదీప్‌ కుమార్‌ (పీకే) బెనర్జీ కన్నుమూశారు. కొంతకాలంగా న్యూమోనియా, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న 83 ఏళ్ల బెనర్జీ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. 83 ఏళ్ల తన జీవిత కాలంలో 51 ఏళ్లు ఆటకే అంకితమిచ్చారు.

తన కెరీర్‌లో భారత్‌ తరఫున ఫ్రెండ్లీ తదితర మ్యాచ్‌లు కలుపుకొని ఓవరాల్‌గా 84 మ్యాచ్‌లాడిన ఈ స్ట్రయికర్‌ 65 గోల్స్‌ చేశారు. 36 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 19 గోల్స్‌ సాధించాడు. సాకర్‌ క్రేజీ బెంగాల్‌లో ఆయన ఓ ఫుట్‌బాలర్‌ మాత్రమే కాదు ‘అంతకుమించి’! సమున్నతమైన వ్యక్తిత్వం మూర్తీభవించిన ఆయనంటే బెంగాలీ వాసులకు ఎనలేని గౌరవం. అందుకే  ‘పీకే బెనర్జీ’, ‘ప్రదీప్‌ దా’గా చిరపరిచితుడైన అలనాటి ఈ దిగ్గజాన్ని ఎంతగానో ఆరాధిస్తారు. స్ట్రయికర్‌గా... సారథిగా... కోచ్‌గా... ఐదు దశాబ్దాలు ఫుట్‌బాల్‌ కోసమే పరితపించిన ‘బెనర్జీ సాబ్‌’ లేరనే వార్త బెంగాల్‌నే కాదు... భారత క్రీడాలోకాన్నే శోకసంద్రంలో ముంచింది.

భారత ఫుట్‌బాల్‌లో మొనగాడు... 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని మొయినగురిలో 1936, జూన్‌ 23న జన్మించిన బెనర్జీ ఏడుగురి సంతానంలో ఒకరు. ఆయన తండ్రి ప్రొవత్‌ బెనర్జీ చిరుద్యోగి. 1941లో బెనర్జీ కుటుంబం తండ్రి ఉద్యోగరీత్యా జల్పయ్‌గురికి వెళ్లింది. అనంతరం కోల్‌కతాకు చేరాక... అక్కడి కోల్‌కతా మైదాన్‌లో సరదాగా ఫుట్‌బాల్‌ ఆడే క్రమంలో ఓనమాలు నేర్చుకున్నారు. తర్వాత 1951లో తొలిసారి సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ ఆడిన పీకే బెనర్జీ తదనంతర కాలంలో భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ఎంపికై  కీలక ఆటగాడిగా ఎదిగారు. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో ఆయన సభ్యుడిగా ఉన్న భారత్‌  జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. మరో ఒలింపిక్స్‌ వచ్చేసరికి రోమ్‌ (1960) ఈవెంట్‌లో బెనర్జీ భారత జట్టుకు నాయకత్వం వహించారు. ఆ విశ్వ క్రీడల్లో  పటిష్టమైన ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించడంలో ఆయన గోల్‌ దోహదం చేసింది.

అలాగే వరుసగా మూడు ఆసియా క్రీడల్లో (1958–టోక్యో, 1962–జకార్తా, 1966–బ్యాంకాక్‌) ఈ స్ట్రయికర్‌ రాణించారు. 1962 ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణం గెలుపొందడంలో బెనర్జీ కీలకపాత్ర పోషించారు. ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణం నెగ్గడం అదే చివరిసారి. క్రీడాకారుడిగా రిటైర య్యాక 1970 నుంచి 1985 వరకు భారత జట్టుకు కోచ్‌గా సేవలందించారు. పీకే కోచింగ్‌లో భారత్‌ 1970 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గింది. ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు పతకం సాధించడం అదే చివరిసారి. భారత జట్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాక ఆయన 2003 వరకు మోహన్‌ బగాన్, ఈస్ట్‌ బెంగాల్, మొహమ్మడన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ జట్లకు కోచ్‌గా ఉన్నారు.

‘అర్జున’ విజయం ఆయనతోనే... 
జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారుల్ని అవార్డుల తో గుర్తించాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 1961లో ‘అర్జున’ అవార్డులు మొదలయ్యాయి. ఫుట్‌బాల్‌ క్రీడాంశంలో తొలి అర్జున పొందింది ‘ప్రదీప్‌ దా’నే! మళ్లీ 1990లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో ఆయనను గౌరవించింది. ఆయన ఆట, శైలీ చూసేందుకు అప్పుడు మనం లేము. ఇప్పుడు చూసేందుకు ఆ కాలంలో వీడియో కవరేజీలు లేవు. ఏమున్నా బ్లాట్‌ అండ్‌ వైట్‌ ఫొటోలే! అందుకే ‘కంటెంట్‌’ ఉన్నా... కటౌట్‌కు ఎక్కలేకపోయారు. ఈయన సేవల్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) కూడా గుర్తించింది. 

క్రీడాలోకం అశ్రునివాళి...
 
బెనర్జీ సేవల్ని కొనియాడిన భారత క్రీడారంగం ఆయన లేని లోటు పూడ్చలేనిదని నివాళులర్పించింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా, టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ తదితరులు సంతాపం వెలిబుచ్చారు.

>
మరిన్ని వార్తలు