ఆసియా కప్‌ హాకీ టైటిల్‌ లక్ష్యంగా...

5 Nov, 2017 01:49 IST|Sakshi

నేడు ఫైనల్లో చైనాతో భారత మహిళల పోరు

కకమిగహర (జపాన్‌): ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. నేడు జరిగే టైటిల్‌పోరులో భారత్, చైనా జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో చెలరేగుతూ అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్‌ ‘ఆసి యా టైటిల్‌’తో పాటు వరల్డ్‌ కప్‌ బెర్తునూ సాధించాలని తహతహలాడుతోంది. ఫైనల్లో గెలిస్తే భారత అమ్మాయిలు వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తారు.

క్వార్టర్స్‌లో కజకిస్థాన్‌పై, సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌పై గెలవడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. దీనితో పాటు టైటిల్‌ పోరులో తలపడనున్న చైనాను పూల్‌ స్థాయిలో భారత్‌ 4–1తో ఓడించింది. ఇదే ఫలితాన్ని ఫైనల్లోనూ పునరావృతం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. పూల్‌లో ఓడించినప్పటికీ చైనాను తేలిగ్గా తీసుకోబోమని, సరైన వ్యూహాంతో ఫైనల్లోనూ మట్టికరిపిస్తామని జట్టు కెప్టెన్‌ రాణి చెప్పింది.

‘ఆసియా కప్‌’ టైటిల్‌ను నెగ్గిన పురుషుల జట్టు నుంచి తాము స్ఫూర్తి పొందామని, అమ్మాయిలంతా ఫైనల్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొంది. పూల్‌ స్థాయి నుంచి చెలరేగి ఆడుతున్న భారత అమ్మాయిలు ఈ టోర్నీ మొత్తంలో 27 గోల్స్‌ చేయడం విశేషం. భారత డ్రాగ్‌ ఫ్లిక్కర్‌ గుర్జీత్‌సింగ్‌ ఇప్పటివరకు 8 గోల్స్‌ సాధించి టోర్నీలో ఎక్కువ గోల్స్‌ సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. నవ్‌జ్యోత్‌ కౌర్, నవ్‌నీత్‌ కౌర్‌ చెరో నాలుగు గోల్స్‌తో, దీప్‌ గ్రేస్‌ ఎక్కా, రాణి చెరో మూడు గోల్స్‌ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఫైనల్లోనూ రాణించి చాంపియన్‌లుగా నిలవాలనుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు