దిగ్గజ ఫుట్‌బాలర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

6 Sep, 2019 17:54 IST|Sakshi

సావో పాలో : ఫుట్‌బాల్‌ చరిత్రలో బ్రెజిల్‌ను రెండుసార్లు విశ్వవిజేతగా నిలిపిన మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కేఫు ఇంట్లో విషాదం నెలకొంది. కేఫు 30 ఏళ్ల కుమారుడు డానిలో ఫెలిసియానో డి మోరేస్ ఫుట్‌బాల్‌ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కేఫు బ్రెజిల్‌లోని సావో పాలోలో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. కేఫు కుమారుడు డానిలో బుధవారం ఇంట్లోనే ఫుట్‌బాల్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఊపిరి ఆడక అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేఫు అభిమానులు, రియల్‌ మాడ్రిడ్‌, ఇంటర్‌ మిలన్‌ ఫుట్‌బాల్‌ జట్లు ఈ విషయం తెలుసుకొని కేఫు కుమారుడు డానిలోకు ఘన నివాళులు అర్పించాయి. ‘యూఈఎఫ్‌ఏలో ఉన్న ప్రతి టీం తరపున మీ కుమారుడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు’ కేఫునుద్దేశించి యూఈఎఫ్‌ఏ ట్వీట్‌ చేసింది. ఈ విషాద సమయంలో ఫుట్‌బాల్‌ ప్రపంచం మొత్తం మీ కుటుంబసభ్యులకు అండగా ఉంటుందని యూఈఎఫ్‌ఏ పేర్కొంది.

కేఫు 1990 నుంచి 2006  వరకు ఫుట్‌బాల్‌ ఆటగానిగా బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1994, 2002 ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన బ్రెజిల్‌ జట్టుకు కేఫు నాయకత్వం వహించాడు. అతని హయాంలో మూడుసార్లు ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకున్న బ్రెజిల్‌ జట్టు రెండు సార్లు విజేతగా నిలవడం విశేషం. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కేఫు ప్రస్తుతం ఫిఫా తరపున ఖతార్‌లో జరగనున్న 2022 ప్రపంచకప్‌కు  అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని వార్తలు