నిద్రలేవగానే ఏడుపు ఆపుకోలేకపోయా

28 Mar, 2020 13:09 IST|Sakshi

ఇంటికి వెళ్లేందుకు సాయం చేసిన వారికి ధన్యవాదాలు

మీరు చాలా మంచి వారు: మాజీ క్రికెటర్‌ ఓబ్రైన్‌

వెల్లింగ్టన్‌: ఇంగ్లండ్‌లో ఉన్న భార్యాపిల్లలను కలిసేందుకు విమాన టికెట్ల డబ్బుల కోసం అభిమానులతో వీడియో చాటింగ్‌కు సిద్ధమైన న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ ఇయాన్‌ ఓబ్రైన్‌కు ఊరట లభించింది. అతను తన ఇంటికి వెళ్లేందుకు కావాల్సిన 2,250 పౌండ్లు (సుమారు రూ. 2.07 లక్షలు) జమ కావడంతో అతను కన్నీళ్లపర్యంతమవుతూ కృతజ్ఞతలు వ్యక్తం చేశాడు. ‘మీరంతా నిజంగా చాలా మంచివారు. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నిద్ర లేవగానే ఏడుపు ఆపుకోలేకపోయాను’ అని ఓబ్రైన్‌ వీడియోలో చెప్పాడు. ఇంగ్లండ్‌లో ఉన్న తన భార్యకు అనారోగ్యమని, వారికి సహాయం చేయాల్సిన స్థితిలో డబ్బుల్లేక న్యూజిలాండ్‌లో ఇరుక్కుపోయానని చెప్పిన ఓబ్రైన్‌ మాటలకు క్రికెట్‌ అభిమానులు వేగంగా స్పందించి సహాయమందించారు.  

అతని స్వదేశం న్యూజిలాండే అయినా భార్య, ఇద్దరు పిల్లలతో ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తన తల్లిదండ్రులను కలిసేందుకు అతను స్వస్థలం వచ్చాడు. అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఏదోలా వెళ్దామనుకొని అందుబాటులో ఉన్న మూడు ఫ్లయిట్‌లలో అతను బుకింగ్‌ చేశాడు. అయితే ఆ మూడు చివరి నిమిషంలో రద్దు కాగా, డబ్బులు కూడా తిరిగివ్వలేదు. (‘నరకం అంటే ఏమిటో చూశా’)

ఇంగ్లండ్‌లో ఉన్న తన కుటుంబం గురించి అతను తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాడు. ‘నా భార్య ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోంది. ఇప్పుడు ఛాతీకి ఇన్‌ఫెక్షన్‌లాంటిదేమైనా వస్తే కరోనా కారణంగా ఆమె ప్రాణాలకే ప్రమాదం. పైగా ఇద్దరు చిన్నపిల్లలు, 80 ఏళ్ల తల్లి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆమె బాధను కొంత పంచుకోవాలని భావిస్తుంటే ఇప్పుడు నా కారణంగా అది మరింత పెరిగేటట్లు అనిపిస్తోంది’ అని ఓబ్రైన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.. తాను ఇంగ్లండ్‌ వెళ్లడానికి డబ్బుల్లేక పోయానంటూ అభిమానుల ముందుకొచ్చాడు. దీనిపై వెంటనే స్పందించిన అభిమానులు అతను వెళ్లడానికి కావాల్సిన మొత్తాన్ని సమకూర్చారు. న్యూజిలాండ్‌ తరఫున 22 టెస్టులు, 10 వన్డేలు ఒబ్రైన్‌ ఆడాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో 58 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడగా, ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు పరంగా చూస్తే 91 మ్యాచ్‌లు ఆడాడు.

మరిన్ని వార్తలు