'ఏం జరుగతుందోనని ప్రతిరోజు భయపడేవాడిని'

28 Jun, 2020 12:01 IST|Sakshi

లండన్‌ : అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ప్లాయిడ్‌ హత్య అనంతరం వర్ణ వివక్షపై మరోసారి దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికి అతని మృతి పట్ల ప్రపంచంలో ఏనదో ఒక మూల వర్ణ వివక్షపై నిరసనజ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్ణ వివక్ష అనేది ప్రతీ అంశంలోనూ సామాన్యంగా మారిపోయింది. ఇక క్రీడా ప్రపంచంలోనూ వర్ణ వివక్షకు చోటు ఉందనడంలో సందేహం లేదు. మొన్నటికి మొన్న ఐపీఎల్‌ సందర్భంగా తాను వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నానంటూ విండీస్‌ క్రికెటర్‌ డారెన్‌ సామి పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఫిలిప్‌ డీఫ్రెటిస్‌ తాను క్రికెట్‌ ఆడిన రోజుల్లో వివక్షను ఎదుర్కొన్నానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.('కోహ్లి అత్యుత్తమ ఆటగాడనేది అందుకే')

'జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో రెండు, మూడు సార్లు బెదిరింపులు వచ్చాయి. ఇంగ్లండ్‌ జట్టుకు ఆడితే.. కాల్చి చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏకంగా సొంత కారు మీద ఉన్న నా పేరును తీసేసుకునేలా చేశారంటే ఏ స్థాయిలో వివక్ష ఎదుర్కొన్నానో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటపై దృష్టి పెట్టడం కష్టం. అయినా నా ప్రతిభతో అలాంటి వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. ఇంగ్లండ్‌కు ఆడుతున్న రోజుల్లో నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఏం జరుగుతుందో అనే భయంతోనే ఆడేవాడిని' అంటూ చెప్పుకొచ్చాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిలిప్‌ డీఫ్రెటిస్‌ 1986-97 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ తరపున 44 టెస్టులు, 103 వన్డేలు ఆడాడు. 

మరిన్ని వార్తలు