పుజారా ఇన్నింగ్స్‌కు మాజీ క్రికెటర్లు ఫిదా!

1 Sep, 2018 17:01 IST|Sakshi

సౌతాంప్టన్‌: కీలక సమయంలో శతకంతో భారత్‌ను గట్టెక్కించిన టీమిండియా నయావాల్‌ చతేశ్వర పుజారాపై మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఓవైపు వికెట్లు పడుతున్నా టెయిలండర్లతో పోరాడిన తీరును కొనియాడారు. ఒక దశలో భారత్‌ స్కోరు 142/2... క్రీజ్‌లో పుజారాతో పాటు కోహ్లి ఉన్నాడు. భారీ ఆధిక్యం సునాయాసంగా లభిస్తుందని అనిపించింది. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి స్కోరు 195/8కు చేరుకుంది. మరో 51 పరుగులు వెనుకబడి ఉండగా, 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో చతేశ్వర్‌ పుజారా (257 బంతుల్లో 132 నాటౌట్‌; 16 ఫోర్లు) పట్టుదలగా నిలబడి శతకంతో చెలరేగాడు. ఇషాంత్‌తో తొమ్మిదో వికెట్‌కు 32, బుమ్రాతో పదో వికెట్‌కు 46 పరుగుల చొప్పున జత చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 273 పరుగులకు ఆలౌటై 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. చివరి రెండు వికెట్లకు భారత్‌ 78 పరుగులు జోడిస్తే అందులో పుజారా చేసినవే 54 ఉన్నాయి. దాదాపు ఆరు గంటల పాటు క్రీజ్‌లో నిలిచిన పుజారా కెరీర్‌లో 15వ సెంచరీ సాధించాడు. దీంతో తన ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 

క్రికెట్‌ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పుజారా ఇన్నింగ్స్‌ను ఆస్వాదించానని తన ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ ట్వీట్‌ చేశాడు. మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం పుజారాను ఆకాశానికెత్తాడు.‘కొన్ని ఇన్నింగ్స్‌లు ఉన్నతస్థానానికి తీసుకెళ్తాయి. అలాంటిదే పుజారా ఇన్నింగ్స్‌. ఇషాంత్‌, బుమ్రాలతో 75 పరుగులు జతచేయడం చాలా రోజులు గుర్తుంటుంది. ఇప్పుడు భారత బౌలర్లు రాణించాల్సిన సమయం’ అని ట్వీట్‌ చేశాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌ సైతం పుజారా ఇన్నింగ్స్‌కు ముగ్దుడయ్యాడు.

మరిన్ని వార్తలు