రోహిత్‌కు మాజీల మద్దతు

22 Aug, 2019 16:06 IST|Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగనున్న తొలి టెస్టు తుది జట్టులో టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ ఆడటంపై ఇంకా క్లారిటీ లేదు. ఈరోజు(గురువారం) రాత్రి గం.7.00లకు సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో విండీస్‌తో భారత్‌ మొదటి టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. అయితే రోహిత్‌ శర్మ పరిమిత ఓవర్ల స్పెషలిస్టు అనే అపవాదు ఉండటంతో టెస్టు మ్యాచ్‌ల్లో అతన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే విండీస్‌తో మ్యాచ్‌లో కూడా రోహిత్‌ తుది జట్టులో  ఉండేది అనుమానంగానే ఉంది. భారత జట్టు ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగితేనే రోహిత్‌కు చాన్స్‌ ఉంది. ఇక్కడ కూడా హనుమ విహారి నుంచి రోహిత్‌కు పోటీ ఉంది.

కాగా,  వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్‌ను ఆడించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. రోహిత్‌ను ఎంపిక చేస్తేనే జట్టులో సమతుల్యత వస్తుందని ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడగా, ఒకవేళ రోహిత్‌ను భారత్‌ ఎలెవన్‌లో తీసుకోకపోతే అది తప్పుడు నిర్ణయమే అవుతుందని పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. టెస్టుల్లో కూడా రోహిత్‌ ఒక గొప్ప ఆటగాడనే విషయం విస్మరించకూడదని స్పష్టం చేశాడు.

ఇక భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సైతం రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు. రోహిత్‌ను ఎంపిక చేయడమే కాకుండా ఓపెనర్‌గా పంపాలని కోరాడు. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా పంపాలని సూచించాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ ఐదు సెంచరీలు చేయడాన్ని గంగూలీ ఇక్కడ ప్రస్తావించాడు. అదే ఫామ్‌ను టెస్టుల్లో కూడా కొనసాగించేందుకు రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రయోగం చేయాలన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా