ఒలింపియన్‌ ఫుట్‌బాలర్‌ హకీమ్‌కు కరోనా

16 Jul, 2020 01:23 IST|Sakshi
సయ్యద్‌ షాహిద్‌ హకీమ్

సాక్షి, హైదరాబాద్‌: భారత మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌ కోవిడ్‌–19 బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన 81 ఏళ్ల హకీమ్‌ స్వయంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన నగరంలోని ఒక హోటల్‌లో ప్రభుత్వ పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకొని త్వరలోనే ఇంటికి వెళతానని హకీమ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. హకీమ్‌కు ముందుగా న్యుమోనియా సోకగా... పరీక్షల అనంతరం కరోనాగా తేలింది.

గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన ఆయన ముందుగా మిలిటరీ ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నించగా పడకలు అందుబాటులో లేవని తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రిలలో సౌకర్యాలపై సందేహంతో చివరకు హోటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ (ఎస్‌ఏ) రహీమ్‌ కుమారుడైన హకీమ్‌ రిటైర్మెంట్‌ అనంతరం కోచ్‌గా, రిఫరీగా కూడా పని చేశారు. ఫుట్‌బాల్‌కు హకీమ్‌ అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2017లో ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారంతో గౌరవించింది.  

మరిన్ని వార్తలు