అజిత్‌ వాడేకర్‌ కన్నుమూత

16 Aug, 2018 01:02 IST|Sakshi

భారత క్రికెట్‌కు విశేష సేవలు

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ముంబై: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, కోచ్, సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అజిత్‌ లక్ష్మణ్‌ వాడేకర్‌ (77) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో బుధవారం తుది శ్వాస విడిచారు. వాడేకర్‌... 1941 ఏప్రిల్‌ 1న నాటి బొంబాయిలో జన్మించారు. 1958లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 1966లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడారు. 8 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 37 టెస్టులాడి 2,113 పరుగులు, రెండు వన్డేలు ఆడి 73 పరుగులు చేశారు. 1974లో రిటైరయ్యారు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ అయిన వాడేకర్‌ మూడో స్థానంలో దిగేవారు. స్లిప్‌లో చురుకైన ఫీల్డర్‌. భారత్‌ తొలి వన్డే జట్టులోనూ వాడేకర్‌ సభ్యుడు కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో 67 పరుగులతో రాణించారు. మొత్తం ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 237 మ్యాచ్‌ల్లో 47.03 సగటుతో 15,380 పరుగులు చేసిన వాడేకర్‌కు దూకుడైన ఆటగాడిగా పేరుంది. 

విదేశీ విజయ సారథి... : గావస్కర్, విశ్వనాథ్‌ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్, బేడి, ప్రసన్న, వెంకట్రాఘన్, చంద్రశేఖర్‌ వంటి దిగ్గజ స్పిన్నర్లున్న జట్టుకు వాడేకర్‌ సారథ్యం వహించారు. భారత్‌ ఆయన కెప్టెన్సీలోనే 1971లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో తొలిసారిగా టెస్టు సిరీస్‌లను గెలిచింది. 1972–73లో స్వదేశంలో ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించింది. వరుసగా మూడు సిరీస్‌లు నెగ్గడంతో సారథిగా వాడేకర్‌ పేరు మార్మోగిపోయింది. అయితే, 1974లో ఇంగ్లండ్‌లో పర్యటించిన జట్టుకూ కెప్టెన్సీ వహించిన ఆయన ఆ సిరీస్‌లో జట్టు మూడు టెస్టుల్లోనూ ఓడటంతో రిటైర్మెంట్‌ ప్రకటించారు. అనంతరం 1990ల్లో అజహరుద్దీన్‌ సారథ్యంలోని భారత జట్టుకు మేనేజర్‌ కమ్‌ కోచ్‌గా వ్యవహరించారు. 1998–99 మధ్యకాలంలో సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. లాలా అమర్‌నాథ్, చందూ బోర్డె తర్వాత ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా చేసిన మూడో వ్యక్తిగా రికార్డుల కెక్కారు. 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ పుర స్కారం పొందారు. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను సీకే నాయుడు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నారు. వాడేకర్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.  

మరిన్ని వార్తలు