భారత మాజీ క్రికెటర్‌ మాధవ్‌ ఆప్టే కన్నుమూత

24 Sep, 2019 04:05 IST|Sakshi
మాధవ్‌ ఆప్టే

ముంబై: భారత మాజీ క్రికెటర్‌ మాధవ్‌ ఆప్టే సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1952–53 మధ్య కాలంలో ఓపెనర్‌గా 7 టెస్టులు ఆడిన ఆప్టే 49.27 సగటుతో 542 పరుగులు చేశారు. వెస్టిండీస్‌తో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 163 పరుగులు చేసి భారత్‌ను ఓటమి నుంచి తప్పించడం ఆయన అత్యుత్తమ ప్రదర్శన. ఈ సిరీస్‌లో విశేషంగా రాణించినా ఆ తర్వాత ఆప్టే మరో టెస్టు ఆడలేకపోయారు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 67 మ్యాచ్‌లలో ఆయన 38.79 సగటుతో 3336 పరుగులు సాధించారు. 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ముంబైలోని ప్రఖ్యాత ‘కంగా లీగ్‌’ పోటీల్లో మాధవ్‌ ఆప్టే ఆడటం విశేషం!  ‘క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా’కు అధ్యక్షుడిగా పని చేసిన ఆప్టే... 14 ఏళ్ల వయస్సులోనే సచిన్‌ టెండూల్కర్‌ ప్రతిభను గుర్తించి పట్టుబట్టి మరీ తమ క్లబ్‌ తరఫున ఆడే అవకాశం కల్పించారు. త్వరలోనే ఇతను భారత్‌కు ఆడతాడంటూ భవిష్యత్తును చెప్పారు. ఆప్టే మృతి సందర్భంగా దీనిని గుర్తు చేసుకున్న సచిన్‌... ఆయనకు తన తరఫు నుంచి నివాళులు అర్పించాడు.   

మరిన్ని వార్తలు