వినోద్ కాంబ్లీకి గుండెపోటు

30 Nov, 2013 01:03 IST|Sakshi
వినోద్ కాంబ్లీకి గుండెపోటు

సాక్షి, ముంబై: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ శుక్రవారం గుండెపోటుకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన స్థానిక లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటల సమయంలో చెంబూర్‌లోని తన ఇంటి నుంచి బాంద్రాకు బయలుదేరిన కాంబ్లీకి ఛాతీలో నొప్పి రావడంతో కారులోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
 
 
 అదే దారిలో వెళ్తున్న మాతుంగా డివిజన్ సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సుజాత పాటిల్ అతన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో కాంబ్లీని కార్డియాక్ ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. గతేడాది జూలైలో కాంబ్లీకి యాంజియోప్లాస్టీ జరిగింది. భారత్ తరఫున కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 54.20 సగటుతో 1084 పరుగులు; వన్డేల్లో 32.59 సగటుతో 2477 పరుగులు చేశాడు. 2000లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన కాంబ్లీ 2011లో ఫస్ట్‌క్లాస్ కెరీర్ నుంచి తప్పుకున్నాడు. ఇటీవల సచిన్ రిటైర్మెంట్ పార్టీకి తనను ఆహ్వానించలేదని మాస్టర్‌పై బహిరంగంగానే విమర్శలు చేశాడు.
 

మరిన్ని వార్తలు