ఐపీఎల్‌ బెట్టింగ్‌కు పాల్పడినందుకు... 

3 Apr, 2019 03:11 IST|Sakshi

భారత మహిళల క్రికెట్‌ మాజీ కోచ్‌ అరోథే అరెస్ట్‌  

వడోదర: భారత క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయే వార్త... ఆటగాడిగా, కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న తుషార్‌ అరోథే (52) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లో పాల్గొన్నందుకు అరోథేతో పాటు మరో 18 మందిని బరోడా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక హోటల్‌లో బెట్టింగ్‌ చేస్తున్నట్లు తెలియడంతో దాడి జరిపి వీరందరినీ పట్టుకున్నామని...వారి ఫోన్‌లు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు వడోదర్‌ డీపీపీ (క్రైమ్‌) జేఎస్‌ జడేజా వెల్లడించారు. 2008, 2012లో ఆయన భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచింగ్‌ బృందంలో సభ్యులుగా ఉన్నారు. అయితే తుషార్‌ పెద్ద ఘనత భారత జట్టును ప్రపంచ కప్‌ ఫైనల్‌ చేర్చడమే. 2017 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆయన టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత జట్టులోని సభ్యులతో విభేదాల నేపథ్యంలో గత ఏడాది టి20 ప్రపంచ కప్‌కు ముందు అరోథే కోచ్‌ పదవి కోల్పోయారు.  ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన అరోథే 18 ఏళ్ల కెరీర్‌లో 114 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 13 సెంచరీలు సహా 6105 పరుగులు చేశారు. 

పాకిస్తాన్‌లో ఐపీఎల్‌ నిషేధం! 
ఇస్లామాబాద్‌:  తమ దేశంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని పాకిస్తాన్‌ నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లను తమ దేశంలో చూసేలా చేస్తూ భారత్‌ ‘వ్యూహాత్మకంగా’ పాక్‌ క్రికెట్‌ను దెబ్బ తీస్తోందని మంత్రివర్గం అభిప్రాయ పడింది. భారత దేశవాళీ టోర్నీని తమ వద్ద అనుమతించడంలో అర్థం లేదని ప్రసారశాఖ మంత్రి ఫవాద్‌ చౌదరి అన్నారు. పుల్వామా ఉదంతం తర్వాత అప్పట్లో జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లను ‘డీ స్పోర్ట్స్‌’ భారత్‌లో ప్రసారం కాకుండా ఆపివేసింది.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు