‘రవిశాస్త్రి కంటే గొప్ప కోచ్‌ ఎవరూ లేరు’

26 Jun, 2020 19:56 IST|Sakshi

ఆండ్రీ ఫ్లవర్‌ కోచ్‌గా ఉంటే అతనికే నా ఓటు

వారిని హ్యాండిల్‌ చేయడంలో శాస్త్రి దిట్ట

అక్తర్‌ను కంట్రోల్‌ చేసే కోచ్‌ లేకపోయాడు

పాక్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ

కరాచీ: సుమారు మూడేళ్ల క్రితం తొలిసారి టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రవిశాస్త్రి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఒక సక్సెస్‌ఫుల్‌ కోచ్‌గా భారత క్రికెట్‌ జట్టుకు సేవలందిస్తూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. 2018లో దక్షిణాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఒక టెస్టు మ్యాచ్‌ను గెలవడంతో కోచ్‌గా రవిశాస్త్రికి గుర్తింపు వచ్చింది అదే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ గెలవడంతో పాటు 2019లో ఆస్ట్రేలియా గడ్డపై భారత  టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో తన ప్రాభవాన్ని మరింత పెంచుకున్నాడు. అదే కాకుండా గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కప్‌ సాధించకపోయినప్పటికీ సెమీ ఫైనల్‌ వరకూ వెళ్లడంలో కూడా కోచ్‌ ముద్ర కనబడింది. కాగా, కోచ్‌గా వరల్డ్‌కప్‌లో విఫలం చెందాడని కొంతమంది ఆరోపించినా, రవిశాస్త్రిపై నమ్మకంతో మరొక టర్మ్‌ కోచ్‌గా అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ప్రధానంగా విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా, శిఖర్‌ ధావన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లతో శాస్త్రి కోచ్‌గా నెట్టుకురావడం అంత ఈజీ కాదనే వాదన వినిపించినా అతనికే ప్రాధాన్యత ఇస్తూ రెండోసారి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. భారత క్రికెటర్లతో సఖ్యతగా ఉండటం కూడా అతన్ని రెండోసారి కోచ్‌గా చేయడానికి ఒక కారణం. (‘భజ్జీపై నిషేధం వద్దని ఏడుస్తూ వేడుకున్నా’)

ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న కోచ్‌లలో రవిశాస్త్రిదే టాప్‌ ప్లేస్‌ అంటున్నాడు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ. ప్రధానంగా టీమిండియా క్రికెట్‌ను ఎలా హ్యాండిల్‌ చేయాలో రవిశాస్త్రికి బాగా తెలిసిన అంటున్నాడు. ప్రధానంగా స్టార్‌ ఆటగాళ్లకు ఎలా దిశానిర్దేశం చేయాలో రవిశాస్త్రికి ఎవరూ చెప్పనక్కర్లేదని తెలిపాడు. తన యూట్యూడ్‌ వీడియో చాట్‌లో భాగంగా ‘బాసిత్‌ అలీ’ షోలో రవిశాస్త్రిని పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో రవిశాస్త్రి కంటే గొప్ప కోచ్‌ ఎవరూ లేరని అభిప్రాయపడ్డాడు. తాను రవిశాస్త్రికి కోచ్‌గా తొలిస్థానం ఇస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఒకవేళ జింబాబ్వే దిగ్గజ ఆటగాడు ఆండ్రీ ఫ్లవర్‌ కోచ్‌గా ఉండి ఉంటే తన ఓటు అతనికే వేసేవాడినన్నాడు. ఇప్పుడు ఫ్లవర్‌ కోచ్‌గా లేడు కాబట్టి ఆ స్థానం రవిశాస్త్రిదేనన్నాడు. ‘ రవిశాస్త్రి దిగ్గజ ఆటగాడు. అందులో సందేహం లేదు. ఒక ఆటగాడిగా ఎలా సక్సెస్‌ అయ్యాడో కోచ్‌గా కూడా రవిశాస్త్రి సక్సెస్‌ బాటలో ఉన్నాడు. అతని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లలో ఒకటి నేను చూశా. మీడియాకు ఇచ్చే సమాధానంలో చాలా ముక్కుసూటితనం కనిపించింది. కోచ్‌గా చేసే వ్యక్తికి ఎప్పుడూ అవతలి వ్యక్తికి అడిగిన ప్రశ్నకు తెలివిగా కౌంటర్‌ ఇవ్వాలి. అది రవిశాస్త్రికి బాగా తెలుసనే విషయం ఆ కాన్ఫరెన్స్‌లో గ్రహించా. జట్టును పటిష్టంగా తీర్చిదిద్దాడు. రవిశాస్త్రి చేసే జాబ్‌ అంత ఈజీ కాదు. పెద్ద ఆటగాళ్లను హ్యాండిల్‌ చేయడం బాగా తెలియాలి. అది రవిశాస్త్రికి బాగా తెలుసు. మా జట్టులో షోయబ్‌ అక్తర్‌ను హ్యాండిల్‌ చేసే కోచ్‌ లేకపోయాడు. అక్తర్‌ పెద్ద ఆటగాడు అనే కారణంతో కోచ్‌లు చూసి చూడనట్లు వదిలేసే వారు. పెద్ద ఆటగాడైనా, చిన్న  ఆటగాడైనా వారిని హ్యాండిల్‌ చేయడం చాలా ముఖ్యం’ అని బాసిత్‌ అలీ పేర్కొన్నాడు. (టై అంటే టై.. సూపర్‌ ఓవర్‌ ఏమిటి?)

>
మరిన్ని వార్తలు