రెట్టించిన ఉత్సాహంతో ధోని సేన!

17 Jun, 2016 19:36 IST|Sakshi
రెట్టించిన ఉత్సాహంతో ధోని సేన!

 హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ను 3-0 తో క్లీన్స్వీప్ చేసిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువ సేన.. ఇప్పుడు టీ 20 సిరీస్కు  రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమైంది. రేపట్నుంచి ఆరంభమయ్యే మూడు టీ 20 సిరీస్లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. దీనిలో భాగంగా ఇరు జట్ల మధ్య  శనివారం సాయంత్రం గం.4.30ని.లకు హరారే స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో  తొలి టీ 20 ప్రారంభం కానుంది.  ఈ సిరీస్ ద్వారా మరికొంత ఆటగాళ్లను భారత్ పరీక్షించనుంది.

 

యువ ఆటగాళ్లు మన్ దీప్ సింగ్, జయంత్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్ లు  జింబాబ్వే టూర్ కు ఎంపికైనా ఇప్పటివరకూ అవకాశం రాలేదు. దీంతో వీరిని టీ 20 సిరీస్లో బరిలోకి దింపే అవకాశం ఉంది. చివరి వన్డేలో అవకాశం దక్కించుకుని హాఫ్ సెంచరీతో మెరిసిన ఫజల్ కు  మరో అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతోంది. భారత టీ 20 జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితోపాటు, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండగా, బౌలింగ్ విభాగంలో  బూమ్రా, బరిందర్ శ్రవణ్ లతో పాటు చాహల్ లు మరోసారి ఆకట్టుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
 

చివరిసారి(2015)లో భారత్ ఇక్కడ పర్యటించినప్పుడు వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినా, ఆ తరువాత టీ 20 సిరీస్ను వైట్ వాష్ చేయడంలో విఫలమైంది. అజింక్యా రహానే నేతృత్వంలోని ఆనాటి భారత జట్టు టీ 20 సిరీస్ ను 1-1 తో సరిపెట్టుకుంది.    దీంతో టీ 20 సిరీస్ లో టీమిండియా ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శంచకుండా ఉండాలి.  మరోవైపు ప్రస్తుతం ఉన్న జట్టులో మనీష్ పాండే, కేదర్ జాదవ్లకు మాత్రమే గత జింబాబ్వే పర్యటనలో టీ 20సిరీస్ ఆడిన అనుభవం ఉంది. టీమిండియా మరోసారి పూర్తి స్థాయి ఆటను ప్రదర్శిస్తే ఆతిథ్య జింబాబ్వే కష్టాలు ఖాయం.

మరిన్ని వార్తలు