క్వార్టర్స్‌లో సింధు, సైనా

12 Apr, 2019 04:37 IST|Sakshi

సిక్కి జోడి కూడా

కశ్యప్, ప్రణయ్‌ ఔట్‌

సింగపూర్‌ ఓపెన్‌ ​​​​​​ 

సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు, హైదరాబాదీ స్టార్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సమీర్‌ వర్మ కూడా క్వార్టర్స్‌ చేరారు. అయితే సీనియర్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లిద్దరూ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.  

చెమటోడ్చిన సైనా 
మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 21–16, 18–21, 21–19తో థాయ్‌లాండ్‌కు చెందిన పొర్న్‌పవి చొచువాంగ్‌పై చెమటోడ్చి గెలిచింది. ఇటీవల మలేసియా ఓపెన్‌లో థాయ్‌ షట్లర్‌ చేతిలో తనకెదురైన పరాజయానికి హైదరాబాదీ స్టార్‌ బదులు తీర్చుకుంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ సైనాకు 21వ ర్యాంకులో ఉన్న చొచువాంగ్‌ గట్టిపోటీనిచ్చింది. మూడు గేమ్‌ల వరకు హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు సైనా పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సింధు 21–13, 21–19తో మియా బ్లిచ్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌)ను వరుస గేముల్లో కంగుతినిపించింది. కేవలం 40 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–12, 23–21తో  డెన్మార్క్‌కు చెందిన హన్స్‌ క్రిస్టిన్‌ సోల్‌బెర్గ్‌పై గెలుపొందగా, సమీర్‌ వర్మ 21–15, 21–18తో లు గ్వాంగ్జూ (చైనా)పై అలవోక విజయం సాధించాడు.  

పోరాడి ఓడిన కశ్యప్‌ 
పారుపల్లి కశ్యప్‌కు 9–21, 21–15, 16–21తో నాలుగో సీడ్‌ చెన్‌లాంగ్‌ (చైనా) చేతిలో చుక్కెదురైంది. ఫలితం నిరాశపరిచినప్పటికీ భారత సీనియర్‌ షట్లర్‌... చైనా సీడెడ్‌ ఆటగాడికి గట్టిపోటీ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌) 21–11, 21–11తో వరుస గేముల్లోనే హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ఆటకట్టించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీ 21–17, 6–21, 21–19తో హాంకాంగ్‌కు చెందిన ఐదో సీడ్‌ తంగ్‌ చున్‌ మన్‌– సె యింగ్‌ సుయెట్‌ జంటకు షాకిచ్చింది. 

మరిన్ని వార్తలు