ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్ల పతకాల పంట

21 Jan, 2020 04:30 IST|Sakshi

ఒకే రోజు నాలుగు పతకాలు

గువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్‌–17 బాలుర 81 కేజీల విభాగంలో షేక్‌ లాల్‌ బషీర్‌ (విశాఖపట్నం) స్వర్ణం నెగ్గగా... జి. రవిశంకర్‌ (డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కడప జిల్లా) రజతం సాధించాడు. లాల్‌ బషీర్‌ (స్నాచ్‌లో 112+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 142) మొత్తం 254 కేజీలు బరువెత్తి చాంపియన్‌గా నిలిచాడు. రవిశంకర్‌ (స్నాచ్‌లో 106+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 143) మొత్తం 249 కేజీలు బరువెత్తి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

అండర్‌–21 బాలుర 89 కేజీల విభాగంలో ఆదిబోయిన శివరామకృష్ణ యాదవ్‌ (డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కడప జిల్లా) రజతం గెలిచాడు. శివరామకృష్ణ యాదవ్‌ (స్నాచ్‌లో 125+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 150) మొత్తం 275 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరీలో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్‌ హల్వత్‌ కార్తీక్‌ మొత్తం 269 కేజీలు బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. అండర్‌–17 బాలికల 76 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన చుక్కా శ్రీలక్ష్మి కాంస్య పత కాన్ని సొంతం చేసుకుంది. శ్రీలక్ష్మి మొత్తం 156 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. అండర్‌–21 బాలికల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విభాగంలో శ్రియ సాయి యనమండ్ర–గురజాడ శ్రీవిద్య (తెలంగాణ) జంట కాంస్యం సాధించింది.

మరిన్ని వార్తలు