రోహిత్‌ ‘ఫోర్‌’ కొడతాడా! 

22 Mar, 2019 00:59 IST|Sakshi

నాలుగో ట్రోఫీ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌ 

భారీ బడ్జెట్‌ సినిమాలాంటి ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌...పెద్ద మొత్తాలతో ఆటగాళ్లను ఎంచుకోవడమే కాదు, అవసరం ఉన్నా లేకపోయినా అడిగినంత ఇచ్చి మరీ సహాయక సిబ్బందిని నియమించుకునే టీమ్‌ అంబానీది. లీగ్‌ ఆరంభంలో అదంతా వృథా ఖర్చులాగే కనిపించేది. కానీ తొలి సారి చాంపియన్‌గా నిలిచి కుదుటపడిన తర్వాత ఈ జట్టు లీగ్‌పై తమ ప్రభావం చూపించింది.

అందరికంటే ముందు మూడు టైటిల్స్‌ను అందుకున్న ముంబై ఇండియన్స్‌ లీగ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు (97) గెలిచిన జట్టుగా నిలిచింది. ప్రతీ సీజన్‌లో ఆరంభంలో పరాజయాలు ఎదురై నిష్క్రమించే స్థితికి చేరడం, ఆ తర్వాత ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసి వరుస విజయాలతో దూసుకుపోవడం ముంబైకే చెల్లింది. ఈ సారి కూడా ఇతర జట్లతో పోలిస్తే పటిష్టంగానే కనిపిస్తున్న రోహిత్‌ సేన నాలుగో టైటిల్‌ వేటలో బరిలో నిలిచింది. మరో సారి దానిని సాధించే సత్తా టీమ్‌కు ఉందా..! 

బలాలు:  భారత స్టార్, జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే ముంబై ప్రధాన బలం అనడంలో సందేహం లేదు. 2018లో 14 మ్యాచ్‌లలో కలిపి 286 పరుగులు మాత్రమే చేసిన రోహిత్‌ ఐపీఎల్‌లో తన చెత్త ప్రదర్శనను నమోదు చేశాడు. అదే జట్టు ఫలితంలో కూడా ప్రతిబింబించింది. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్‌ తనదైన శైలిలో చెలరేగితే ముంబైకి తిరుగుండదు. క్వింటన్‌ డి కాక్, ఎవిన్‌ లూయీస్‌లాంటి విధ్వంసక ఆటగాళ్లతో జట్టు బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. మిడిలార్డర్‌లో పొలార్డ్, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా జట్టు బ్యాటింగ్‌కు కీలకం. గత ఏడాది టీమ్‌ తరఫున సూర్య కుమార్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

టీమిండియాకు దూరమైన యువరాజ్‌ సింగ్‌ కూడా జట్టులో ఉన్నాడు కానీ అతని ఇటీవలి ప్రదర్శనను బట్టి చూస్తే పెద్దగా ఆశించడానికి లేదు. పేస్‌ బౌలింగ్‌లో ఎప్పటిలాగే బుమ్రా ప్రదర్శనే జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయగలదు. అయితే వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో అతను జాగ్రత్తగా మ్యాచ్‌ను ఎంచుకుంటూ ఆడాల్సిన స్థితి ఉంది. పేస్‌లో మెక్లీనగన్, మిల్నే, ఇటీవలే భారత్‌లో ఆడిన బెహ్రన్‌డార్ఫ్‌ అందుబాటులో ఉన్నారు. వీరు తమ వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. ఆల్‌రౌండర్లుగా పాండ్యా సోదరులు హార్దిక్, కృనాల్‌లపై పెద్ద బాధ్యతే ఉంది. ఇటీవల ముస్తాక్‌ అలీ ట్రోఫీలో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌ ఈ సారి ముంబైకి కీలక బ్యాట్స్‌మన్‌గా మారనున్నాడు. భారత ఆటగాడిగా అతనికి అన్ని మ్యాచ్‌లు దక్కే అవకాశం ఉంది. పొలార్డ్‌ విఫలమైతే కటింగ్‌ అందుబాటులో ఉన్నాడు.  

బలహీనతలు:  రోహిత్‌ విఫలమైతే ఎలా ఉంటుందో గత ఏడాది ముంబైకి తెలిసొచ్చింది. హార్దిక్, పొలార్డ్‌ కూడా ఆశించిన విధంగా తమ బాధ్యత నెరవేర్చలేదు. పొలార్డ్‌లో మునుపటి కళ తగ్గిపోగా...హార్దిక్‌ వరుస గాయాల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. పేరుకు మలింగ జట్టులో ఉన్నా ఫిట్‌నెస్‌ను చూస్తే అతని ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనేది దైవాధీనం. పైగా నాటి పదును కూడా లేదు. మిడిలార్డర్‌లో ఒక బలమైన బ్యాట్స్‌మన్‌ ఉంటే బాగుంటుంది.

స్పిన్‌లో కూడా టీమ్‌ బలహీనంగా కనిపిస్తోంది. టీమ్‌లో చెప్పుకోదగ్గ స్పిన్నర్‌ ఎవరూ లేరు. గతేడాది కొత్తగా వచ్చి వైవిధ్యం చూపిన మయాంక్‌ మర్కండేను ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌ బాగా చదివేశారు. కృనాల్‌ లెఫ్టార్మ్‌ స్పిన్‌ ఏమాత్రం ప్రభావం చూపుతుందనేదే సందేహమే. జయంత్‌ యాదవ్, రాహుల్‌ చహర్‌లను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పటిలా కాకుండా ఈ సారైనా తొలి దశలో వరుసగా మ్యాచ్‌లు గెలిస్తే ముంబై ముందుకెళ్లటం ఖాయం.  

జట్టు వివరాలు:  రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జయంత్‌ యాదవ్, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్, మయాంక్, ఇషాన్‌ కిషన్, ఆదిత్య తారే, బుమ్రా, సూర్యకుమార్, కృనాల్, యువరాజ్, రాహుల్‌ చహర్, సిద్దేశ్‌ లాడ్, హార్దిక్, బరీందర్‌ శరణ్, పంకజ్‌ జైస్వాల్, రసిఖ్‌ సలామ్, అనుకూల్‌ రాయ్‌ (భారత ఆటగాళ్లు), డి కాక్, కటింగ్, పొలార్డ్, మలింగ, మెక్లీనగన్, లూయీస్, బెహ్రన్‌డార్ఫ్, మిల్నే (విదేశీ ఆటగాళ్లు).   

►2013, 2015, 2017 లలో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ గత ఏడాది ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. జట్టు నుంచి ఒక్క బ్యాట్స్‌మన్‌కు కూడా టాప్‌–10 పరుగుల జాబితాలో  చోటు దక్కలేదు.

మరిన్ని వార్తలు