ఎం‘బాప్‌రే’..!

1 Jul, 2018 03:57 IST|Sakshi
ఎంబాపె ఆనందం, మెస్సీ నిర్వేదం

అర్జెంటీనా వెన్నువిరిచిన ఎంబాపె

రెండు గోల్స్‌తో మెరిసిన టీనేజ్‌ సంచలనం

ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాపై 4–3తో ఫ్రాన్స్‌ గెలుపు

కొదమ సింహాలు కదంతొక్కిన వేళ... ఆటగాళ్ల దూకుడుతో పోటీ రక్తికట్టింది... ఆధిపత్యం అటుఇటు చేతులు మారింది... గోల్స్‌పై గోల్స్‌తో నాకౌట్‌ కిక్కెక్కించింది... ఆఖరి క్షణాల వరకు ఉత్కంఠ రేకెత్తింది... ఫ్రాన్స్‌ టీనేజ్‌ మెరిక కైలిన్‌ ఎంబాపె మెరుపులకు అర్జెంటీనా వెలుగు మసకబారింది! ఫలితంగా సూపర్‌ స్టార్‌ మెస్సీ నాయకత్వంలోని జట్టు పయనం 2018 ప్రపంచకప్‌లో ప్రి క్వార్టర్స్‌తోనే ముగిసింది. 
 
కజన్‌: ప్రపంచ కప్‌ నుంచి అర్జెంటీనా నిష్క్రమించింది. కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ అసహాయుడిగా మిగిలిపోగా... గత మ్యాచ్‌ హీరో మార్కస్‌ రొజొ ‘మొదటే’ ముప్పు తెచ్చిపెట్టగా... కీలక సమయంలో దక్కిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేక... ప్రత్యర్థిని మరెవరూ నిలువరించలేని పరిస్థితుల్లో ఆ జట్టు పరాజయం మూటగట్టుకుంది. 19 ఏళ్ల యువ కెరటం కైలిన్‌ ఎంబాపె మెరుపులు... బెంజమిన్‌ పవార్డ్‌ చురుకైన ఆటతో తొలి నాకౌట్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌దే పైచేయి అయింది. మాజీ చాంపియన్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన పోరులో ఫ్రాన్స్‌ 4–3తో అర్జెంటీనాను మట్టికరిపించింది. ప్రపంచకప్‌ చరిత్రలో అర్జెంటీనాపై ఫ్రాన్స్‌ జట్టుకిదే తొలి విజయం కావడం విశేషం. ఫ్రాన్స్‌ తరఫున ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎంబాపె (64వ, 68వ నిమిషాలు) రెండు గోల్స్‌ కొట్టగా, ఆంటోన్‌ గ్రీజ్‌మన్‌ (13వ ని.), పవార్డ్‌ (57వ ని.) చెరో గోల్‌ చేశారు. అర్జెంటీనాకు డి మారియా (41వ ని.), మెర్కాడో (48వ ని.), కున్‌ అగ్యురో (90+3వ ని.) స్కోరు అందించారు.

ఆ హీరోనే దెబ్బకొట్టాడు...
ఫ్రాన్స్‌ ఏకంగా ఆరు మార్పులతో మ్యాచ్‌లో దిగింది. దిగ్గజ జట్ల మధ్య పోటీ అందుకు తగ్గట్లే ప్రారంభమైంది. మాస్కెరనో షాట్‌తో అర్జెంటీనాకు మొదటి అవకాశం దక్కింది. మరోవైపు గ్రీజ్‌మన్‌ కొట్టిన ఫ్రీ కిక్‌ గోల్‌బార్‌ అంచుల్లోంచి పక్కకుపోయింది. 4–3–3 వ్యూహంతో దిగిన అర్జెంటీనా కంటే ఫ్రాన్సే (4–2–3–1) సౌకర్యంగా కనిపించింది. గత మ్యాచ్‌లో నైజీరియాపై కీలక గోల్‌తో హీరోగా నిలిచిన రొజొ ఈసారి పెద్ద పొరపాటు చేశాడు. 11వ నిమిషంలో పాస్‌ను అందుకుని పరిగెడుతున్న ఎంబాపెను కిందపడేశాడు. దీంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది. దీనిని గ్రీజ్‌మన్‌... సునాయాసంగా నెట్‌లోకి కొట్టి జట్టుకు ఆధిక్యం అందించాడు.

తర్వాత సైతం వేగం, బంతిని అట్టిపెట్టుకుంటూ పాస్‌లతో ప్రత్యర్థిని ఎంబాపె హడలెత్తించాడు. మరోవైపు 19వ నిమిషంలోనూ ఫ్రాన్స్‌కు ఫ్రీ కిక్‌ లభించినా పోగ్బా సద్వినియోగం చేయలేకపోయాడు. అటు సహచరుల నుంచి పాస్‌లు అందకపోవడంతో మెస్సీ వద్దకు బంతి రావడమే గగనమైంది. పైగా ఫ్రాన్స్‌ దాడులు చేసేలా అర్జెంటీనా దారిచ్చింది. ప్రతిఘటించే ప్రయత్నంలో వరుసగా ఇద్దరు ఆటగాళ్లు ఎల్లోకార్డులు అందుకున్నారు. అగ్యురో, హిగుయెన్‌లను దింపకపోవడం కూడా దెబ్బకొట్టింది. సెంటర్‌ ఫార్వర్డ్‌ లేకపోవడంతో ఫ్రాన్స్‌ రక్షణ శ్రేణిని ఇబ్బంది పెట్టలేకపోయింది. ఐనా అర్జెంటీనా బంతిని నియంత్రణలో ఉంచుకుంది. తొలి భాగం ముగియవస్తుందనగా... బనేగా పాస్‌ను డి బాక్స్‌ ముందు అందుకున్న డి మారియా 25 గజాల నుంచి గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు.  

ఆధిక్యంలో నిలిచినా...
రెండో భాగం ప్రారంభంలోనే అర్జెంటీనాకు ఊహించని రీతిలో గోల్‌ దక్కింది. బాక్స్‌ ఏరియా లోపల పాస్‌ను అందుకున్న మెస్సీ గోల్‌పోస్ట్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు. నేరుగా వస్తే ఫ్రాన్స్‌ కీపర్‌ దానిని నిరోధించేవాడే. కానీ మధ్యలో ఉన్న మెర్కాడొ కాలికి బంతి నెట్‌లోకి చేరింది. అర్జెంటీనా 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆనందాన్ని పవార్డ్‌ పది నిమిషాల్లోనే ఆవిరి చేశాడు. హెర్నాండెజ్‌ అందించిన క్రాస్‌ పాస్‌ను సరిగ్గా డి బాక్స్‌ దగ్గర దొరకబుచ్చుకున్న పవార్డ్‌... ఓవైపు ఒరుగుతూ ముచ్చటైన రీతిలో గోల్‌గా మలిచాడు. గణాంకాలు 2–2తో సమమై... అరగంట ఆట మాత్రమే మిగిలి ఉన్న దశలో ఎంబాపె విజృంభించాడు.

నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టి ఫ్రాన్స్‌ను పైమెట్టున నిలబెట్టాడు. 64వ నిమిషంలో మరోసారి హెర్నాండెజ్‌ క్రాస్‌ ఇవ్వగా... గోల్‌పోస్ట్‌ ఎదుట జరిగిన డ్రామాలో ఎంబాపె చురుగ్గా స్పందించి బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. తర్వాతి గోల్‌ను అయితే మళ్లీమళ్లీ చెప్పుకొనేలా కేవలం మూడంటే మూడే పాస్‌ల్లో నెట్‌లోకి కొట్టాడు. అర్జెంటీనా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినా... దాదాపు అందుకోలేనంత ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్‌ మ్యాచ్‌ను మరింత ఆధీనంలోకి తీసుకుంది. దీంతో మెస్సీ బృందం చేసేదేమీలేకపోయింది. ఇంజ్యూరీ సమయంలో మెస్సీ క్రాస్‌ పాస్‌ను అగ్యురో హెడర్‌ గోల్‌తో ఒకింత ఆశ రేపాడు. చివరి క్షణం (90+6)లోనూ అద్భుతం జరుగుతుందేమో అనిపించింది. అయితే బంతి గోల్‌పోస్ట్‌ పైకి వెళ్లడంతో అర్జెంటీనా ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్‌ హర్షాతిరేకాల్లో మునిగిపోయింది.

మెస్సీని మించినోడు... అర్జెంటీనాను ముంచినోడు
అర్జెంటీనా దిగ్గజం, 31 ఏళ్ల లియోనల్‌ మెస్సీకి ప్రపంచ కప్‌ను తీరని కలగానే మిగిల్చిన ఈ మ్యాచ్‌... 19 ఏళ్ల ఫార్వర్డ్‌ ఎంబాపెను అంతర్జాతీయ స్టార్‌ను చేసింది. వాస్తవానికి రెండు జట్ల మధ్య తేడా ఎంబాపెనే. చిరుత పరుగుతో మ్యాచ్‌ గతినే మార్చేశాడతడు. పాస్‌లతో పాటు ఆట ఆసాంతం ఒకే వేగం కనబర్చిన ఎంబాపె నాలుగు నిమిషాల తేడాతో రెండు గోల్స్‌ కొట్టి ప్రత్యర్థిని కుదేలు చేశాడు. అతడిని అందుకునే ప్రయత్నంలోనే అర్జెంటీనా గత మ్యాచ్‌ హీరోలు బనేగా, రొజొ ఎల్లో కార్డులకు గురయ్యారు. ఫ్రాన్స్‌ జట్టులో అందరి దృష్టి గ్రీజ్‌మన్, పోగ్బాపై ఉండగా... వారిని తోసిరాజంటూ ఎంబాపె సరికొత్త హీరోగా అవతరించాడు. 

మళ్లీ వస్తావా మెస్సీ...?
అన్నీ తానే అయి రెండు ప్రపంచ కప్‌లలో అర్జెంటీనాను నడిపించిన మెస్సీ మరో కప్‌లో ఆడతాడనేది అనుమానమే. ఇప్పటికే ఓసారి రిటైర్మెంట్‌ ప్రకటించి, అందరి ఒత్తిడితో విరమించుకున్న అతడు... రష్యాలో ఏమంత ప్రభావం చూపలేకపోయాడు. ఐస్‌లాండ్‌ వంటి ప్రత్యర్థి కూడా అతడే లక్ష్యంగా వ్యూహం రచించి విజయవంతమైంది. నైజీరియాతో మ్యాచ్‌లో మాత్రమే గోల్‌ కొట్టగలిగిన మెస్సీ ... ఫ్రాన్స్‌పై మెరుపు పాస్‌లు అందించి స్కోరుకు దోహదపడగలిగాడు. కానీ తన స్థాయి ఆటగాడు గోల్‌ కొడితేనే ప్రత్యర్థికి పంచ్‌ తగులుతుంది. ప్రపంచకప్‌లో తమ జట్టు పయనంపై తన రిటైర్మెంట్‌ నిర్ణయం ఆధారపడి ఉంటుందని మెస్సీ నెల క్రితం ప్రకటించాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో...?

కొసమెరుపు: క్రీడల్లో 10వ నంబర్‌ జెర్సీకి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. క్రికెట్‌లో సచిన్‌ ఇదే జెర్సీ ధరించేవాడు. మెస్సీది కూడా 10వ జెర్సీనే. ఈ మ్యాచ్‌లో మెరిసిన ఎంబాపె 10వ నంబరు జెర్సీతోనే ఆడాడు. మెస్సీ తన మార్కు చూపలేకపోయాడు.

విశేషాలు
► తాను ఆడిన ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు మెస్సీ ఒక్క గోల్‌ చేయకపోవడం గమనార్హం.  
► ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో కేవలం ఐదోసారి మాత్రమే అర్జెంటీనా తన ప్రత్యర్థి జట్టుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్‌ సమర్పించుకుంది.  
► 1986లో బెల్జియం (యూఎస్‌ఎస్‌ఆర్‌ చేతిలో 3–4తో ఓటమి) తర్వాత కనీసం మూడు గోల్స్‌ చేసి ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పరాజయం పాలైన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది.  
► గ్రీజ్‌మన్‌ గోల్‌ చేసిన మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు ఫ్రాన్స్‌ ఓడిపోలేదు.  


>
మరిన్ని వార్తలు