ఫ్రాన్స్ గర్జన: జర్మనీకి షాక్

8 Jul, 2016 16:43 IST|Sakshi
ఫ్రాన్స్ గర్జన: జర్మనీకి షాక్

మార్సెల్లే: దాదాపు రెండు దశాబ్దాల తరువాత యూరోకప్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ గర్జించింది. పటిష్టమైన ప్రత్యర్థి జర్మనీని మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం రాత్రి జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 తేడాతో జర్మనీని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. సొంత అభిమానుల మధ్య జరిగిన  మ్యాచ్లో ఫ్రాన్స్ ఆద్యంతం దుమ్మురేపింది. ఫ్రాన్స్ ఫార్వర్డ్ ఆటగాడు ఆంటోని గ్రిజ్మన్  రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆట 45, 72 నిమిషాల్లో గ్రిజ్ మన్ గోల్స్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆ తరువాత  జర్మనీ పోరాడినా ఫ్రాన్స్ చక్కటి డిఫెన్స్ తో ముందు తలవంచకతప్పలేదు.  తద్వారా 1958 తర్వాత ఓ ప్రధాన టోర్నీలో జర్మనీపై గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించింది. 


1984లో సొంత గడ్డపై జరిగిన యూరోకప్ టోర్నీలో విజేతగా నిలిచిన ఫ్రాన్స్.. ఆ తర్వాత ఈ టోర్నీలో కనీసం ఫైనల్కు కూడా చేరలేకపోయింది. మళ్లీ ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఇదే టోర్నీలో పోర్చుగల్తో అమీతుమీ తేల్చుకోనుంది. 1998లో వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఏ ప్రధాన ట్రోఫీని సాధించని ఫ్రాన్స్.. ఈసారి యూరో చాంపియన్ గా నిలవాలని భావిస్తోంది. ఒకవేళ యూరో ట్రోఫీని ఫ్రాన్స్ గెలిస్తే అంతకుముందు ఎక్కువసార్లు ఆ ఘనతను సాధించిన జర్మనీ, స్పెయిన్ ల సరసన నిలుస్తుంది. సోమవారం ఫ్రాన్స్-పోర్చుగల్ మధ్య యూరో టైటిల్ పోరు జరుగనుంది.

మరిన్ని వార్తలు