ఈ నిరసనలతో ఎలాగబ్బా..!

17 Dec, 2019 01:44 IST|Sakshi

19న ఐపీఎల్‌ వేలంపై ఫ్రాంచైజీల ఆందోళన

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్నాయి. బంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌ అట్టుడుకుతోంది. ఐపీఎల్‌ వేలం ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో నిర్వహించనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యాలు కలవరపడుతున్నాయి. వచ్చే సీజన్‌కు సంబంధించి ఈ నెల 19న ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఫ్రాంచైజీలు ఆరాతీస్తున్నాయి. కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. దీనిపై ఓ ఫ్రాంచైజీ అధికారి మాట్లాడుతూ ‘తీవ్రంగా ఆందోళన చెందడం లేదు కానీ... అక్కడి పరిస్థితులపై ఓ కన్నేశాం. వేలం గురువారం జరగనుండగా... సోమవారం భారీ ర్యాలీలతో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులపై సమీక్షిస్తున్నాం’ అని అన్నారు. మరో ఫ్రాంచైజీ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఫ్రాంచైజీ వర్గాలు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై నమ్మకముంచాయి. పౌరసమాజమే కాదు... రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై భగ్గుమంటోంది. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 20న కోల్‌కతాలో తమ పార్టీ నేతలతో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో వేలం పాట ముగిశాక మరుసటి రోజు తిరుగుపయనం కావడంపై కూడా ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయి. అయితే గురువారం జరిగే ఐపీఎల్‌ వేలం కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేదని... ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే వేలం కార్యక్రమం జరుగుతుందని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు