‘నా కొడుకు క్రికెట్‌కు జోర్డాన్‌ లెక్క’

19 Jul, 2019 20:56 IST|Sakshi

లండన్‌ : జోఫ్రా ఆర్చర్‌.. ఐపీఎల్‌ అభిమానులకు తప్ప మిగతా ప్రపంచానికి అంతగా తెలియని వ్యక్తి. కానీ ఇప్పుడు అతడి పేరు విశ్వమంతా మారుమోగుతోంది. అదృష్టం కొద్ది జట్టులోకి వచ్చి ఏకంగా తన జట్టుకు తొలిసారి ప్రపంచకప్‌నే అందించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఫైనల్‌ మ్యాచ్‌లో అనూహ్యంగా సూపర్‌ ఓవర్‌ వేసి ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ అందించిన ఆర్చర్‌పై అతడి తండ్రి ఫ్రాంక్‌ ఆర్చర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏదో ఒక రోజు ఆర్చర్‌ క్రికెట్‌ను ఏలుతాడని పేర్నొన్నాడు. ఇక తన కొడుకుపై నమ్మకంతో సూపర్‌ ఓవర్‌ అవకాశం ఇచ్చిన సారథి ఇయాన్‌ మోర్గాన్‌ను కృతజ్ఞతలు తెలిపాడు. 

‘ఆడేది తొలి ప్రపంచకప్‌, అంతకుముందు ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. అయినా సూపర్‌ ఓవర్‌లో ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా జట్టును జగజ్జేతగా నిలిపాడు. దేశం గర్వించేలా చేశాడు. జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సూపర్‌ ఓవర్‌లో నీషమ్‌ సిక్సర్‌ కొట్టిన వెంటనే ఏ బౌలర్‌ అయినా ఆత్మరక్షణలోకి పడతాడు. కానీ, ఆర్చర్ మాత్రం దానిని అధిగమించాడు. గొప్ప ఆటగాళ్ళు మాత్రమే అలా చేయగలరు. క్రెడిట్ మొత్తం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కే దక్కుతుంది. అతడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని తిరిగి చెల్లించాడు. ఆర్చర్‌ ఆట ఇప్పుడే ప్రారంభమైంది. క్రికెట్‌కు మైఖెల్‌ జోర్డాన్‌(దిగ్గజ బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు) అవుతావని అనేవాడిని. బాస్కెట్‌ బాల్‌ను జోర్డాన్‌ శాసించినట్టు.. ఆర్చర్‌ ఏదో ఒక రోజు క్రికెట్‌ను ఏలుతాడు’అంటూ ఫ్రాంక్‌ ఆర్చర్‌ ఉద్వేగంగా పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు