-

‘ఫ్రెంచ్‌’ కిరీటమెవరిదో?

28 May, 2017 10:26 IST|Sakshi
‘ఫ్రెంచ్‌’ కిరీటమెవరిదో?

నేటి నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌
ఫేవరెట్స్‌గా నాదల్, జొకోవిచ్‌


పారిస్‌: తనకెంతో కలిసొచ్చిన చోట పదోసారి పాగా వేయాలని రాఫెల్‌ నాదల్‌... ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయాలబాట పట్టాలని నొవాక్‌ జొకోవిచ్‌... అందరి అంచనాలను తలకిందులు చేసి విజేతగా అవతరించాలని యువ తారలు అలెగ్జాండర్‌ జ్వెరెవ్, డొమినిక్‌ థీమ్‌... క్లే కోర్టులపై కూడా గొప్పగా రాణించే సత్తా ఉందని నిరూపించుకోవాలని బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే... అవకాశం వస్తే రెండోసారి టైటిల్‌ సొంతం చేసుకోవాలని స్విస్‌ నంబర్‌వన్‌ వావ్రింకా... ఇలా ఒకరికంటే ఎక్కువ ఫేవరెట్స్‌తో ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) మొదలయ్యే ఈ టోర్నీ జూన్‌ 11న జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌తో ముగుస్తుంది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌కు అద్వితీయమైన రికార్డు ఉంది. ఈ టోర్నీలో 12 సార్లు పాల్గొన్న నాదల్‌ తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు. 2009లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో, 2015లో క్వార్టర్‌ ఫైనల్లో, 2016లో మూడో రౌండ్‌లో అతను నిష్క్రమించాడు. ఈ ఏడాది క్లే కోర్టు సీజన్‌లో మూడు టైటిల్స్‌ సాధించి జోరుమీదున్న నాదల్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)తోపాటు యువ తారలు జ్వెరెవ్‌ (జర్మనీ), థీమ్‌ (ఆస్ట్రియా) నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ‘డ్రా’ ప్రకారం నాదల్‌కు సెమీఫైనల్లో జొకోవిచ్‌ ఎదురుకావొచ్చు. ఈ సీజన్‌లో రోమ్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఓడించి జ్వెరెవ్‌ టైటిల్‌ సాధించగా... ఇదే టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌పై థీమ్‌ సంచలన విజయం సాధించి తమను తక్కువ అంచనా వేయొద్దని సంకేతాలు పంపించారు.

శనివారం ముగిసిన జెనీవా ఓపెన్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్‌) తన టైటిల్‌ను నిలబెట్టుకొని ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఆండీ ముర్రే ఫామ్‌లో లేకపోయినా అతడిని తక్కువ అంచనా వేసే ప్రసక్తి లేదు. సెరెనా విలియమ్స్, షరపోవా గైర్హాజరీలో మహిళల సింగిల్స్‌ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్‌ కనిపించడంలేదు. నంబర్‌వన్‌  కెర్బర్‌ (జర్మనీ), డిఫెండింగ్‌ చాంపియన్‌ ముగురుజా (స్పెయిన్‌)లతోపాటు మూడో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా), రెండో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), 13వ సీడ్‌ మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌) టైటిల్‌ రేసులో ఉన్నారు.   

అభిమన్యుకు వైల్డ్‌ కార్డు: భారత యువ ఆటగాడు వన్నెంరెడ్డి అభిమన్యు ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్‌ బాలుర సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో పాల్గొనేందుకు ‘వైల్డ్‌ కార్డు’ సంపాదించాడు. శనివారం జరిగిన రాండీవూ ఈవెంట్‌ ఫైనల్లో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అభిమన్యు 6–1, 4–6, 6–1తో హికారు షిరైషి (జపాన్‌)పై గెలిచి ఈ ఘనత సాధించాడు.

మరిన్ని వార్తలు