ప్లిస్కోవా ఇంటిబాట

31 May, 2019 22:53 IST|Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్‌) ఇంటిబాట పట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్లిస్కోవా 3–6, 3–6తో 31వ సీడ్‌ పెట్రా మాట్రిచ్‌(క్రొయేషియా) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 23 విన్నర్లు కొట్టిన ప్లిస్కోవా 28 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో సెవత్సోవా(లాత్వియా) 6–7 (3/7), 6–6, 11–9తో మెర్టెన్స్‌(బెల్జియం)పై, వాండ్రొసోవా(చెక్‌రిపబ్లిక్‌) 6–4, 6–4తో సూరజ్‌ నవారో(స్పెయిన్‌)పై, మాడిసన్‌ కీస్‌(అమెరికా) 7–5, 5–7, 6–3తో హాన్‌(ఆస్ట్రేలియా)పై, ముగురుజ(స్పెయిన్‌) 6–3, 6–3తో స్వితోలినా(ఉక్రెయిన్‌)పై నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. 

ఫెదరర్‌ టైబ్రేక్‌లో...
పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ రోజర్‌ ఫెదరర్‌(స్విట్జర్లాండ్‌) 6–3, 6–1, 6–2, 7–6(10/8)తో రూడ్‌(నార్వే)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రెండు సెట్లు అలవోకగా గెల్చుకున్న ఫెదరర్‌కు మూడో సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ సెట్‌ను టైబ్రేక్‌లో ఫెడెక్స్‌ గెలుచుకున్నాడు. కాగా, పురుషుల డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌(భారత్‌)–డెమోలైనర్‌(బ్రెజిల్‌) జోడీ పోరాటం ముగిసింది. హెన్నీ కొంటినెన్‌(ఫిన్లాండ్‌)–జాన్‌ పీర్స్‌(ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో 3–6, 4–6 దివిజ్‌ శరణ్‌ జోడీ పరాజయం పాలైంది.
 

>
మరిన్ని వార్తలు