ఫైనల్లో ఓటమి.. అరుదైన చాన్స్‌ మిస్‌

28 Oct, 2019 12:26 IST|Sakshi

పారిస్‌ (ఫ్రాన్స్‌):  ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత జోడి సాత్విక్‌-చిరాగ్‌ జోడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి 18-21,16-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్‌ గిడియోన్‌–కెవిన్‌ సుకముల్జో (ఇండోనేసియా) ద్వయంపై ఓటమి పాలైంది. రెండు గేమ్‌ల్లో సాత్విక్‌-చిరాగ్‌లు పోరాడినప్పటికీ టైటిల్‌ను సాధించలేకపోయారు.  టాప్‌ సీడ్‌ చేతిలో సాత్విక్‌-చిరాగ్‌లు ఓటమి పాలై రన్నరప్‌తోనే  సరిపెట్టుకున్నారు. కేవలం 35 నిమిషాలు పాటు జరిగిన తుది పోరులో గిడియోన్‌-సుకముల్జోలు ఆకట్టుకున్నారు.

భారత్‌ జోడికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఓవరాల్‌గా 11 ఫైనల్లో  సాత్విక్‌-చిరాగ్‌లు 3వ ఓటమి. ఇక ఇండోనేసియా జోడి సుకుముల్జో-గిడియోన్‌ చేతిలో సాత‍్విక్‌-చిరాగ్‌లకు 7వ పరాజయం. ఈ టైటిల్‌ గెలిస్తే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన రెండో భారత డబుల్స్‌ జోడిగా సాత్విక్‌-చిరాగ్‌లు అరుదైన ఘనతను సాధించేవారు. కాకపోతే ఓటమి పాలు కావడంతో పార్తో గంగూలీ-విక్రమ్‌ సింగ్‌ల సరసన నిలిచే అవకాశాన్ని కోల్పోయారు. 1983లో పార్తో గంగూలీ-విక్రమ్‌ సింగ్‌లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన తొలి భారత జోడి.

 ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ జంటను...క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో ర్యాంక్‌ జోడీని బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం.. సెమీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ.. ఐదో సీడ్ హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్‌) జంటను ఓడించి ఫైనల్‌కు చేరింది.

మరిన్ని వార్తలు