మరోసారి ‘మూడో కన్ను’ తప్పు చెప్పింది!

28 Dec, 2019 14:31 IST|Sakshi

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టి చాలా ఏళ్లే అయినా ఇప్పటికీ అందులో లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఫీల్డ్‌ అంపైర్లకు స్పష్టత లేని సందర్భాల్లో డీఆర్‌ఎస్‌ ద్వారా థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించినా నిరాశే మిగులుతుంది. ఇక్కడ థర్డ్‌ అంపైర్‌ చేస్తున్న తప్పిదమో, ఆ టెక్నాలజీ మీది పూర్తి అవగాహన లేకపోయిన కారణంగానో తప్పిదాలు జరుగుతున్నాయో అర్థం కాక గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రికెట్‌లో మూడో కన్నుగా పిలవబడే థర్డ్‌ అంపైర్‌ విధానం మరొకసారి వివాదాస్పదమైంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా డీఆర్‌ఎస్‌ వివాదం వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా మిచెల్‌ సాంత్నార్‌ ఔట్‌కు సంబంధించి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఒక బంతి సాంత్నార్‌ గ్లౌజ్‌కున్న మణికట్టు బ్యాండ్‌కు తగిలిపైకి లేచింది. దాన్ని ఆసీస్‌ ఫీల్డర్‌ అందుకున్నాడు. అయితే అది ఔట్‌ కాదంటూ ఫీల్డ్‌ అంపైర్‌ ఎరాస్‌మస్‌ ప్రకటించాడు.

దీనిపై డీఆర్‌ఎస్‌కు వెళ్లగా అక‍్కడ కూడా ఆసీస్‌కు చుక్కెదురైంది. థర్డ్‌ అంపైర్‌గా ఉన్న అలీమ్‌ దార్‌.. అది ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే కట్టుబట్టాడు. దాంతో సాంత్నార్‌ నాటౌట్‌గా బతికిపోయాడు. కాగా, హాట్‌స్పాట్‌లో పదే పదే పర్యవేక్షించగా  ఆ బంతి మణికట్టుకున్న బ్యాండ్‌కు తాకింది. దీన్ని సరిగా థర్డ్‌ అంపైర్‌ గమనించకపోవడంతో మరోసారి డీఆర్‌ఎస్‌ డ్రామా చోటు చేసుకుంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా క్రికెటర్లు తీవ్ర నిరాశను వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అసలు థర్డ్‌ అంపైర్‌ ఒక నిర్ణయాన్ని ప్రకటించలేనప్పుడు ఆ విధానం ఉండి ప‍్రయోజనం ఏముంటుందని ఆసీస్‌ బ్యాటింగ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ మండిపడ్డాడు.  ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ను సవాల్‌ చేసినప్పుడు థర్డ్‌ అంపైర్‌ అనేవాడు ఎటువంటి అనుమానాలకు తావులేకుండా నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుందని, మరి అటువంటుది తప్పిదం థర్డ్‌ అంపైర్‌ చేస్తే ఇక డీఆర్‌ఎస్‌కు అర్థం ఏముంటందని ఆసీస్‌ పేసర్‌ జేమ్స్‌ ప్యాటినసన్‌ లంచ్‌ బ్రేక్‌లో తన అసంతృప్తిని వెళ్లగక‍్కాడు.

మరిన్ని వార్తలు